Arekapudi Gandhi: అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

by Gantepaka Srikanth |
Arekapudi Gandhi: అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు సంబంధించి 12 కమిటీ సిఫార్సులు, 302 ఆడిట్ పేరాల్లో కొన్నింటికి వివరణాత్మక నోట్స్, చర్యా నివేదికలు వచ్చినప్పటికీ ఇంకా చాలా వాటికి రావల్సి ఉందని.. వీటిని వీలైనంత త్వరగా కమిటీకి అందజేసేలా సంబంధిత అధికారులు శ్రద్ధ చూపాలని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ(PAC Chairman Arekapudi Gandhi ) అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కాగ్ రాష్ట్ర శాసనమండలికి సమర్పించిన నివేదికలు, పీఏసీ పరిశీలించిన ఆడిట్ పేరాలు, కాగ్ గమనించిన అంశాలపై వివరణాలపై, సంబంధిత శాఖల ప్రతిస్పందన తదితర అంశాలపై కమిటీ చర్చించింది. చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.. కాగ్ నివేదికల్లో ఉన్న ఆడిట్ పేరాలకు సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమర్పించిన వివరణాత్మక నోట్స్‌ను, కమిటీ మునుపటి వార్షిక నివేదికల్లో చేసిన సిఫార్సులపై తీసుకున్న చర్యా నివేదికలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. 32 ప్రభుత్వ విభాగాలకు సంబంధిత 2024 సెప్టెంబర్ 30 వరకు కాగ్ నివేదికల ప్రకారం 302 ఆడిట్ పేరాలు తెలంగాణకు సంబంధించి, 202 ఆడిట్ పేరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాలు, కమిటీ చేసిన సిఫార్సులకు సంబంధించిన వివరణాత్మక నోట్స్, చర్యా నివేదికలు సకాలంలో కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. సంబంధిత శాఖలో కార్యదర్శులు తమ ఆధ్వర్యంలోని శాఖాధిపతులను చైతన్యపరిచి పెండెన్సీని క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్షేత్రస్థాయి నుంచి అవసరమైన సమాచారం రావడంలో జాప్యమే పెండెన్సీకి కారణమవుతోందన్నారు. జిల్లా కలెక్టర్లతో సమీక్షించడం జరుగుతుందని, లెజిస్లేచర్ సెక్రటేరియట్ సమన్వయంతో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించి తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇప్పటివరకు సమర్పించాల్సిన వివరణాత్మక నోట్స్, చర్యా నివేదికలు విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో అకౌంటెంట్ జనరల్ పి. మాధవి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి.నర్సింహాచార్యులు, సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, వంశీకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, రామ్ రావు పవార్, కూనంనేని సాంబశివరావు, భానుప్రసాద్ రావు, రమణ, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed