విద్యుత్ షాక్ తగిలి మూడవ అంతస్తు నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి

by Kalyani |
విద్యుత్ షాక్ తగిలి మూడవ అంతస్తు నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : విద్యుత్ షాక్ తగిలి నిర్మాణంలో భవనం పైనుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఉమ్మడి మహబూబ్ నగర్ వరికుప్పల గ్రామానికి చెందిన యాదగిరి (45) బ్రతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మియాపూర్ లోని మయూరి నగర్ లో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో క్రేన్ ఆపరేట్ పని చేస్తున్నాడు. సోమవారం పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యాదగిరి మూడో అంతస్తు నుంచి కింద ఉన్న ఇటుకల మీద పడిపోయాడు.

కరెంట్ షాక్ కు తోడు ఇటుకల మీద పడడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న ఈ భవనానికి సరైన అనుమతులు లేవని సమాచారం. అలాగే కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో క్రేన్ ఆపరేటర్ యాదగిరి మృత్యువాత పడ్డట్లు తెలుస్తుంది. కరెంట్ షాక్ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులోకి రాలేదు. అటు భవన నిర్మాణదారు ప్రాణానికి వెలకట్టి మృతుడి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed