ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

by Ramesh N |
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్‌లో కేసులో తొలిసారిగా మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరును టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవాళ్లమని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొన్నారు. మూడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ విరివిరిగా వాడుకున్నామని, బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.

హైకోర్టులో బీఆర్ఎస్ పిటీషన్

లోక్ సభ ఎన్నికల వేళ రాధాకిషన్ రావు వాంగ్మూలం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వేళ ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీపై నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్‌లో పేర్కొంది. అయితే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఇందులో తాను, సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా బాధితులమే అని చెప్పారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోందన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. తీవ్రమైన ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా రాధాకిషన్ రావు వాంగ్మూలం, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపణలతో ఉత్కంఠ నెలకొంది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

Advertisement

Next Story