- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేడిగడ్డ రిపేర్‌పై తెలంగాణ సర్కారు మరో సంచలన నిర్ణయం!
దిశ, తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ బాధ్యతలు దాన్ని నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీదేనని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు తగిన కారణాలపైనా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. ఆ కంపెనీయే తన సొంత ఖర్చుతో ఈ రిపేర్ పనులను కంప్లీట్ చేయాలన్నది ప్రభుత్వ వాదన. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, లోపాలకు కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని నొక్కిచెప్తున్నది. సీఎం అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల రిపేర్లపై చర్చ జరిగిన తర్వాత నిర్మాణ సంస్థలే సొంత ఖర్చుతో పూర్తి చేయాల్సి ఉంటుందనే నిర్ణయం తీసుకున్నది. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం మీడియా సమావేశంలో వెల్లడించారు. నిర్మాణ సంస్థే ఎందుకు భరించాలన్న అంశంలో ప్రభుత్వానికి భిన్నాభిప్రాయమే లేదు.
కంప్లీషన్ సర్టిఫికెటే ఇవ్వలేదు
మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదన్నది ఇరిగేషన్ డిపార్టుమెంటు వాదన. పనులను పూర్తి చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం తరఫున నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ల (లేదా అధికారులు)కు ఇవ్వలేదని గుర్తుచేశారు. పనులు కంప్లీట్ అయినట్లు ఆ కంపెనీ ఇచ్చే ధ్రువీకరణకు అనుగుణంగా ఇంజినీర్లు ఫైనల్ మెజర్‌మెంట్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారని, దాన్ని రిజిస్టర్‌లో రికార్డు చేస్తారని వివరించారు. మెజర్‌మెంట్ బుక్‌లో నిర్మాణ సంస్థకు నిర్దేశించిన పనులను, ఆ సంస్థ నుంచి తీసుకున్న వివరాలను పరిగణనలోకి తీసుకుని ఆ వర్క్స్ పై సంతృప్తి ఉన్నదో లేదో నమోదు చేస్తారని, ఈ ప్రక్రియ కూడా పూర్తి కాలేదని గుర్తుచేశారు. ఇదంతా అయిన తర్వాతనే ఆ పనుల నుంచి కంపెనీ రిలీవ్ అయినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే బ్యారేజీకి సంబంధించి ఏమైనా లోపాలుంటే సరిచేయడానికి డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని, కానీ మేడిగడ్డ విషయంలో దాన్ని నిర్మించిన ఎల్ అండ్ టీ ఇప్పటికీ పైన పేర్కొన్న దశల్లోకి ఎంటర్ కాలేదని ఇరిగేషన్ డిపార్టుమెంటులోని ఓ అధికారి స్పష్టత ఇచ్చారు. ఫైనల్ మెజర్‌మెంట్ బుక్‌లోని వివరాల ఆధారంగా బిల్ పేమెంట్‌పై క్లారిటీ వస్తుందని, దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, కానీ మేడిగడ్డ విషయంలో ఇంకా ఎల్ అండ్ టీ కంపెనీకి ఫైనల్ బిల్ సెటిల్‌మెంట్ కాలేదని తెలిపారు. బ్యారేజీకి సంబంధించి డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు కూడా చేరుకోనందున తప్పనిసరిగా బయటపడిన లోపాలను చక్కదిద్దే బాధ్యత ఆ కంపెనీదే అవుతుందని వివరించారు. కంప్లీషన్ సర్టిఫికెట్ లేని కారణంగా డాక్యుమెంటేషన్ ప్రకారం ఇంకా బ్యారేజీ పనులు కొనసాగుతూ ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుందన్నారు.
కంపెనీ వాదన ఇలా..
ఇదిలా ఉండగా బ్యారేజీ నిర్మాణం పూర్తయినందునే 2019లో ప్రారంభోత్సవం జరిగిందని, అప్పటి నుంచే బ్యారేజీ ఎగువ భాగంలోని నీటిని లిప్టు చేయడం కూడా మొదలైందని కంపెనీ ప్రతినిధుల వాదన. మరోవైపు డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ గడువు కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. కండ్ల ముందు ఇవన్నీ కనిపిస్తున్న తర్వాత ఇంకా కంప్లీట్ కాలేదనే చర్చకు తావే లేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం ఇంకా ఆ స్టేజీకే రాలేదని వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరిగేషన్ డిపార్టుమెంటు అధికారులు ముఖ్యమంత్రికి గతంలోనే వివరించారు. ఎన్డీఎస్ఏ ఇటీవల ఇచ్చిన మధ్యంతర నివేదిక, దానికి కొనసాగింపుగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ ఇటీవల వెలువరించిన ఉత్తర్వులపై తాజాగా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్డీఎస్ఏ సిఫారసులను అమలు చేయాలని, గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ తన ఇంటెరిమ్ రిపోర్టులో పేర్కొన్నది.
ఈ వివరాల ఆధారంగానే కేబినెట్ సమావేశం సైతం మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ పనులు చేయాల్సిన బాధ్యత ఎల్ అండ్ టీ కంపెనీదే తప్ప రాష్ట్ర ప్రభుత్వానిది కాదని, ఆ కంపెనీ తన సొంత ఖర్చుతోనే పూర్తి చేయాల్సి ఉంటుందని నిర్ణయం తీసుకున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం మీడియా సమావేశంలో దీన్ని నొక్కిచెప్పారు. దీనికి తోడు ఎక్స్ టెన్షన్ ఆఫ్ టైమ్ పేరుతో గడువును పొడిగించాలని కోరుతూ ఇరిగేషన్ డిపార్టుమెంటుకు ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవల ఒక లేఖ రాసినట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఏ అంశానికి సంబంధించి గడువును పొడిగించాలని కోరిన విషయాన్ని మాత్రం వివరంగా వెల్లడించడానికి నిరాకరించారు. గడువును పొడిగించాలని కోరడమంటేనే ఇంకా ఆ సంస్థకు బాధ్యతలు ఉన్నాయనే అర్థమేనంటూ ఆ అధికారులు వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందునే రిపేర్ బాధ్యతలను సైతం ఆ కంపెనీయే చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కమిటీని ఏర్పాటు చేసిన ఇరిగేషన్ శాఖ
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల ఇచ్చిన ఇంటెరిమ్ రిపోర్టులో తక్షణం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏయే రిపేర్ పనులు చేయాలో స్పష్టత ఇచ్చింది. వర్షాకాలం వచ్చేలోపే వీటిని కంప్లీట్ చేయాలని సూచించింది. అందులో భాగమే మూడు బ్యారేజీల గేట్లను ఎత్తి ఉంచాలని, గేట్లు లేవడానికి ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చాలని, మూడింటిలో నీటిని నిల్వ చేయరాదని, ఏడో బ్లాకులో కుంగిన భాగాన్ని చక్కదిద్దడంతో పాటు టెక్నికల్‌గా ఏమేం చేయాలో సూచించింది. ఈ సిఫారసులను అమలు చేయడానికి ఇరిగేషన్ డిపార్టుమెంటు కూడా ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) చైర్మన్‌గా నలుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ వింగ్ ఈ-ఇన్-సీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్‌ను సభ్యుడిగా, రామగుండం చీఫ్ ఇంజినీర్‌ను మెంబర్/కన్వీనర్‌గా నియమిస్తూ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రారంభించిన ఏడాదే సాంకేతికసమస్య
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణ సంస్థలకు అప్పగించినప్పుడు మేడిగడ్డ బ్యారేజీ వర్క్స్ ను ఎల్ అండ్ టీ కంపెనీకి అప్పజెప్పింది. 2019లోనే ఈ బ్యారేజీ కంప్లీట్ అయిందని సంస్థ చెప్పుకున్నది. అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టుకు 2019 జూన్‌లోనే ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే వచ్చిన భారీ వరదతో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే సకాలంలో దానికి రిపేర్ పనులు చేయకపోవడంతో గతేడాది భారీ స్థాయిలో నష్టం జరిగింది. కొన్ని పిల్లర్లకు పగుళ్లు రావడంతోపాటు భూమిలోకి కుంగిపోయాయి. దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా ఇంకా దిద్దుబాటు చర్యలు మొదలుకాలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొదలు స్టేట్ డిజైన్ ఆర్గనైజేషన్, ఆరుగురితో కూడిన కేంద్ర అధ్యయన బృందం, స్టేట్ విజిలెన్స్ కమిషన్ మేడిగడ్డ బ్యారేజీపై రకరకాల రిపోర్టులు ఇచ్చాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించింది.