డైలాగులు తప్ప.. పాలన మీద ధ్యాసే లేదు.. CM రేవంత్‌పై RS ప్రవీణ్ కుమార్ ఫైర్

by Satheesh |   ( Updated:2024-06-21 11:42:21.0  )
డైలాగులు తప్ప.. పాలన మీద ధ్యాసే లేదు.. CM రేవంత్‌పై RS ప్రవీణ్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి డైలాగులు చెప్పడం తప్ప.. పాలన మీద ధ్యాసే లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హోం, విద్య శాఖలకు ప్రత్యేక మంత్రులు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. సీఎం దగ్గరే ఈ శాఖలు ఉన్నా ఆ రెండు శాఖల్లో జరగకూడని ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. శాంతి భద్రతలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలని అనుకుంటున్నారా..? అని నిప్పులు చెరిగారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై వారం రోజుల పాటు అత్యాచారం జరుగుతున్నా పొలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి నలభై రోజులు అవుతున్నా దోషులను పట్టుకోలేదని, ఇంత మంది పోలీసులు ఏం చేస్తున్నట్టని నిలదీశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 24 గంటల్లో ఐదు హత్యలు జరిగాయని.. మెదక్‌లో మత కల్లోలాలు జరిగినా పోలీసులు చోద్యం చూశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కొటొచ్చినట్టు కనిపిస్తోందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖను తన దగ్గర పెట్టుకుని ఏం లాభమని, సీఎం అసలు శాంతి భద్రతలపై రివ్యూ చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయంలో పొలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండేదని.. రాష్ట్రంలో 16 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఆధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శాంతి భద్రతల్లో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ హై కమాండ్‌ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

భూపాల పల్లిలో ఎస్‌ఐ దాష్టికం, సుల్తానా బాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం ప్రభుత్వ వైఫల్యాలేనని.. ఇప్పటికైనా శాంతి భద్రతలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పేగులు మెడలో వేసుకుంటాం అనే డైలాగులు తప్ప శాంతి భద్రతల మీద ధ్యాస పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. సమస్య అంతా సీఎం నిర్లక్ష ధోరణితోనే ఉందని, సంచలన ఘటనలు జరిగినా రేవంత్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సీఎం గతంలో ఇలా వ్యవహరించలేదని.. రాష్ట్రం శాంతియుతంగా ఉండటం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదన విమర్శించారు. రాష్ట్రంలో అడుగంటిపోతున్న శాంతి భద్రతలపై బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed