Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఇంఫాల్ పశ్చిమ జిల్లా (Imphal West district) కౌత్రుక్, బిష్ణుపూర్ జిల్లా (Bishnupur district) లోని ట్రోంగ్లావోబీలో బాంబు పేలుళ్లతో సహా కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. లమ్‌షాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌత్రుక్ చింగ్ లైకై గ్రామంపై కుకీ మిలిటెంట్లు (Kuki militants) అధునాతన తుపాకులు, బాంబులతో దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. అనంతరం మిలిటెంట్ల పైకి ఎదురు కాల్పులు జరపగా పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల పాటు కాల్పులు జరిగినట్టు సమాచారం.

అలాగే బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ పోలీస్ స్టేషన్‌కు దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రోంగ్లావోబీ గ్రామంపై అనుమానిత కుకీ ఉగ్రవాదులు దాడి చేసినట్టు బిష్ణుపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. కుకీ మిలిటెంట్లు గెల్జాంగ్, మోల్షాంగ్ ప్రాంతాల నుంచి కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. ఈ సమయంలో గ్రామ వాలంటీర్లతో పాటు రాష్ట్ర బలగాలు మిలిటెంట్లపైకి ఎదురు కాల్పులు జరిపినట్టు తెలిపారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు తెంగ్నౌపాల్ జిల్లాలో నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed