వెంచర్లు, బీడు భూములు, హైవేలకు రైతుబంధు.. ఆరేండ్లలో రూ.18 వేల కోట్లు?

by Rajesh |
వెంచర్లు, బీడు భూములు, హైవేలకు రైతుబంధు.. ఆరేండ్లలో రూ.18 వేల కోట్లు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతుబంధు పథకం ద్వారా వేల కోట్లు వృథా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి 2023 వానకాలం వరకు 11 విడతల్లో సుమారు రూ.72,910 కోట్లను రైతుబంధు స్కీమ్ కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో సుమారు రూ.18 వేల కోట్లు అనర్హులకు, అవసరంలేని భూములకు అప్పనంగా ముట్టజెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తున్నది.

వెంచర్లు, బీడు భూములు, హైవేలుకు సైతం సాయం అందించినట్టు తేలింది. 20 ఎకరాల పైబడిన రైతులకు ఏకంగా రూ.5 వేల కోట్లు పెట్టుబడి సాయం కింద అందినట్టు తేలిందని సమాచారం. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, బడా పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నట్టు సమాచారం. రైతుబంధు పథకం ద్వారా ఎంత మంది అనర్హులు లబ్ధి పొందారు? ఎంత మొత్తంలో ప్రజాధనం వృథా అయింది? అనే కోణంలో లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. త్వరలోనే ఆ వివరాలు బహిరంగ పరచాలని భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

పావు వంతు ప్రజాధనం వృథా

బీఆర్ఎస్ హయాంలో.. రైతుబంధు పథకం పేరుతో రైతులందరికీ ఆర్థిక సాయం చేయాలని భావించిన గత సర్కారు.. సాగులో లేని భూములకు సైతం రైతుబంధు సాయం అందజేసింది. వెంచర్లు, గుట్టలు, బీడు భూములకు, పెద్ద ఫామ్ హౌజ్‌లకు, ఇంజినీరింగ్ కాలేజీలకు, రిసార్టులకు సైతం సాయం పంపిణీ చేసింది. స్కీం నిధుల్లో పావు వంతు నిధులను ఇలా వృథా చేసినట్టు టాక్.

త్వరలో ప్రజల ముందుకు వివరాలు

కేసీఆర్ పాలనలో రైతుబంధు పేరిట జరిగిన వృథాను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది. ప్రతి జిల్లాలో.. ప్రతి ఏటా ఎంత మేర రైతుబంధు సాయం విడుదల చేసింది? అందులో సాగులో లేని భూములు, గుట్టలు, వెంచర్లు, హైవేలకు ఎంత ఇచ్చారు? అనే లెక్కలను రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్ద ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని తెలిసింది. త్వరలో రైతు భరోసా విధివిధానాల తయారు కోసం ఆయన నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానున్నది. ఈలోపే రైతుబంధు పేరిట వృథా అయిన నిధుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని సర్కారు భావిస్తున్నది.

అవకతవకలకు తావులేకుండా రైతుభరోసా

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసాను స్కీంను అర్హులైన రైతులకే అందించేందుకు సిద్ధమైంది. ఏకపక్షంగా విధివిధానాలను తయారు చేయకుండా రైతులు, నిపుణులు, రాజకీయపార్టీల అభిప్రాయాలను తీసుకునేందుకు రెడీ అయింది. రైతు భరోసా పథకంకింద కేవలం సాగు భూములకు, అందులో నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్‌ను రైతుభరోసాకు అమలు చేయాలని భావిస్తున్నది. దీంతో ఐటీ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం అందకపోవచ్చని ప్రభుత్వ వర్గాల టాక్.

Advertisement

Next Story