ఖద్దరు మాటున రౌడీయిజం! మితిమీరుతున్న రౌడీ షీటర్లు?

by Javid Pasha |
ఖద్దరు మాటున రౌడీయిజం! మితిమీరుతున్న రౌడీ షీటర్లు?
X

ఫ్రెండ్లీ పోలీస్ పుణ్యమా? అని జిల్లాలో రౌడీ షీటర్లు పెట్రేగిపోతున్నారు. పోలీసులన్నా, పోలీస్ స్టేషనులన్నా వీరికి ఏమాత్రం గౌరవం, భయం, భక్తి లేదనిపిస్తోంది. ఓ వైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా యథేచ్ఛగా బరితెగించి దందాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో 12 పోలీస్ స్టేషన్లు ఉండగా గత సెప్టెంబర్ 2023నాటికి జిల్లా వ్యాప్తంగా 36మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీస్ రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. వీరిలో ప్రధానంగా జనగామ, రఘునాథపల్లి, లింగాల ఘనవురం, దేవరుప్పుల మండలంలో అధికంగా ఉండడం గమనార్హం. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ముసుగులో కద్దర్ చొక్కా మాటున ఖాకీలను శాసిస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు అధికార బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా, మరికొందరు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలోనూ ఉన్నారు. ఇంకొందరు సొంత వ్యాపారం, వ్యవసాయం, రియల్ దందాలు సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ముసుగులో కొందరు రౌడీషీటర్లు తమ అధికార పలుకుబడితోపాటు రౌడీయిజాన్ని చలాస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలవేళ రౌడీషీటర్లను కట్టడి చేయాల్సిన పోలీస్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రౌడీలు తమ కార్యకలాపాలను చక్కదిద్దుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, జనగామ: ఫ్రెండ్లీ పోలీస్ పుణ్యమా? అని జిల్లాలో రౌడీ షీటర్లు పెట్రేగిపోతున్నారు. పోలీసులన్నా, పోలీస్ స్టేషనులన్నా వీరికి ఏమాత్రం గౌరవం, భయం, భక్తి లేదనిపిస్తోంది. ఓ వైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా యథేచ్ఛగా బరితెగించి దందాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో 12 పోలీస్ స్టేషన్లు ఉండగా గత సెప్టెంబర్ 2023నాటికి జిల్లా వ్యాప్తంగా 36మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీస్ రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. వీరిలో ప్రధానంగా జనగామ, రఘునాథపల్లి, లింగాల ఘనవురం, దేవరుప్పుల మండలంలో అధికంగా ఉండడం గమనార్హం. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ముసుగులో కద్దర్ చొక్కా మాటున ఖాకీలను శాసిస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు అధికార బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా, మరికొందరు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలోనూ ఉన్నారు. ఇంకొందరు సొంత వ్యాపారం, వ్యవసాయం, రియల్ దందాలు సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ముసుగులో కొందరు రౌడీషీటర్లు తమ అధికార పలుకుబడితోపాటు రౌడీయిజాన్ని చలాస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల రఘునాథపల్లిలో ఓ రౌడీ షీటర్ భూ వివాదంలో వృద్ధుడిపై దాడి చేయగా ఆ వృద్ధుడు నడుం విరిగి మంచానపడ్డాడు. ఈ వివాదంలో వృద్ధుడు సదర్ రౌడీషీటర్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా సదర్ రౌడీషీటర్ యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు. ఎన్నికలవేళ రౌడీషీటర్లను కట్టడి చేయాల్సిన పోలీస్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రౌడీలు తమ కార్యకలాపాలను చక్కదిద్దుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చూసీచూడనట్లుగా ఖాకీలు..

ఓ రౌడీ షీటర్ పై ఇప్పటికే 20కి పైగా కేసులు ఉన్నా ఒక్కసారి కూడా పోలీసులు అతన్ని రిమాండ్ చేసింది లేదు, కోర్టు మెట్లు ఎక్కించిన దాఖలాలు అంతకన్నా లేవు. దీంతో పోలీస్ అధికారుల తీరుపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సాక్ష్యాలున్నా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేక, అతడికి సహకరిస్తూ ముందస్తుగా యాంటిస్పేటరీ బెయిల్ వచ్చే విధంగా అధికారులు సహకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఓ రౌడీ అయితే ఏకంగా ఓ మంత్రి పేరు చెప్పి తన కార్యకలాపాలన్నిటినీ కొనసాగిస్తూ పోలీసులను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై ఎన్ని కేసులు ఉన్నా కూడా పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రౌడీ షీటర్లు నెలకు, రెండు నుంచి నాలుగు సార్లు పోలీస్ స్టేషన్లలో హాజరై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సత్ప్రవర్తనతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉంది. వీరికి సంబంధించిన పాస్ పోర్ట్, ఇతర దరఖాస్తులను అనుతించరు. అలాంటిది 20కి పైగా కేసులు ఉన్నా ఓ రౌడీ షీటర్ పాస్ పోర్ట్ పొందడం వెనుక అధికారులను వారు ఎలా ప్రభావితం చేస్తుంన్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధి ముసుగులో చలామణి అవుతున్న ఓ రౌడీ షీటర్‌పై ప్రతి ఏడాదికి సగటున రెండు, మూడు కేసులు నమోదు అవుతున్నా కూడా పోలీసులు ఇంతవరకు అరెస్టు చేసింది లేదు. ఈ రౌడీషీటర్ పట్ల పోలీసుల అనుసరిస్తున్న విధానాన్ని చూసి ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.

బైండోవర్లతోనే సరి...

గతంలో రఘునాథపల్లి సర్కిల్లో పనిచేసిన ఓ ఎస్ఐ, మరో సీఐ, రఘునాథపల్లికి చెందిన ఓ రౌడీషీటర్‌ను కాపాడే ప్రయత్నంలో భాగంగా అతడిపై ఉన్న కేసులను ఎత్తివేసేందుకు అప్పటి సీపీ రంగనాథ్ ఎదుట సదరు రౌడీ షీటర్ ఫైల్ ఉంచారు. గ్రీవెన్స్‌లో ఉన్న సీపీ రంగనాథ్ రౌడీ షీటర్ పై ఉన్న కేసులన్నింటినీ నిషితంగా పరిశీలించి, అతడిపై ఇన్ని కేసులున్నా ఇప్పటివరకు ఎందుకు రిమాండ్ చేయలేదని? పోలీస్ అధికారులను, అదేవిధంగా సదర్ రౌడీషీటర్‌ను చివాట్లు పెట్టి అతడిపై ఉన్న కేసును క్లోజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ ఇద్దరు అధికారులు బదిలీ కావడం తెలిసిందే. తాజాగా మరో కేసు నమోదు కాగా స్థానిక తహశీల్దార్ యుగంధర్ ఎదుట బైండోవర్ చేసి వదిలేయడంతో అతడు అరెస్టు కాకుండానే సమాజంలో తిరుగుతుండడం గమనార్హం. అసలు ఏం జరిగిందనేది? ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. అంతేకాక సదరు రౌడీషీటర్ పై నిత్యం సామాజిక మాధ్యమాల్లో బాహాటంగానే అనేక విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇలాంటివారిని బైండోవర్లతో సరిపెట్టకుండా కటకటాలకు నెట్టి కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. లేకపోతే ఎన్నికల సమయంలో వీరి నుంచి ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ఇటువంటి వారి పట్ల పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

Advertisement

Next Story