కేసీఆర్ సన్నిహితుడికి రేవంత్ రెడ్డి సర్కార్ ఝలక్

by Prasad Jukanti |
కేసీఆర్ సన్నిహితుడికి  రేవంత్ రెడ్డి సర్కార్ ఝలక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో సర్కార్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో అధినేత పార్థసారథి రెడ్డి సంస్థలకు కేటాయించిన భూముల లీజుపై తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్థరాసధికి చెందిన ట్రస్టులకు భూముల లీజు కోసం గంతలో కేసీఆర్ సర్కార్ విడుదల చేసిన జీవో 140 ని నిలిపివేస్తూ తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వం పార్థసారధికి చెందిన సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్ ఆసుపత్రుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. 30 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన కేసీఆర్ సర్కార్ భూమిని కేటాయించి. రూ. 4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి కేవలం ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది.

అయితే హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న విలువైన భూములను తన పార్టీకి చెందిన ఎంపీ పార్థసారథికి చెందిన సంస్థలకు కారుచౌకగా అప్పగించడం పట్ల మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములన్ని కొంత మందికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి, పార్టీకి చెందిన వారికి లీజుకు ఇవ్వడం లేదా విక్రయించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన లావాదేవీలపై పూర్తి ఆధారాలతో నివేదిక ఇవ్వాలని సీఎం రెవెన్యూ శాఖ అధికారులతో పాటు సంబంధింత ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను నిలిపివేశారు.

ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కు టెన్షన్:

ప్రభుత్వ భూముల లీజులు, విక్రయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలతో బీఆర్ఎస్ కు టెన్షన్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ హయాంలో తన అనుకున్న వారందరికీ తక్కువ ధరకే భూములు లీజుకు ఇచ్చారని గతంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డే ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక అటువంటి వాటి జీవోలను నిలిపివేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల్లోని భూములను కేసీఆర్ తన పార్టీ వారికే తక్కువ ధరకు అప్పనంగా అప్పగించారనే విమర్శలు ఉన్నాయి. ఓ వైపు త్వరలో పార్లమెంట్ ఎన్నికల వస్తున్న వేళ గత ప్రభుత్వం చేసిన భూనిర్వాకంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదా అనే టెన్షన్ బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story