ప్రియాంకగాంధీ నామినేషన్‌కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి

by karthikeya |   ( Updated:2024-10-23 02:28:04.0  )
ప్రియాంకగాంధీ నామినేషన్‌కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ప్రియాంకాగాంధీ బుధవారం నామినేషన్ వేయనుండగా, కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరికొందరు సీనియర్ నేతలు కూడా హాజరవుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, మరికొందరు సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. భద్రతా అవసరాల రీత్యా మంగళవారం రాత్రి ఆమె మైసూరులో నైట్ హాల్ట్ చేస్తారని, అనంతరం బుధవారం ఉదయం వయనాడ్ చేరుకుంటారని, ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ రాజమోహన్ ఉన్నితమ్ మీడియాకు వివరించారు. వయనాడ్ కలెక్టర్ ఆఫీసులో ఆమె బుధవారం ఉదయం నామినేషన్ వేయనున్నందున ఆ పరిసరాలతోపాటు నియోజకవర్గమంతా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

గతంలో ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేర్వేరుగా పాల్గొన్నారు. రాయబరేలీ స్థానాన్ని ఉంచుకుని వయనాడ్‌ను వదులుకోవడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ నియోజకవర్గ ప్రజల గొంతును పార్లమెంటులో వినిపించేందుకు ప్రియాంకాగాంధీ సమర్థురాలని, పార్టీలో ఆమెను మించిన వ్యక్తి మరొకరు లేరని, ఆ నియోజకవర్గానికి తన గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని, అందుకే పార్టీ ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు రాహుల్‌గాంధీ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ప్రియాంకాగాంధీ తరఫున ప్రచారం చేయడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు రానున్న రోజుల్లో వెళ్లే అవకాశమున్నది. రాహుల్‌గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4.60 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 3.54 లక్షల ఓట్ల మార్జిన్‌తో గెలిచారు. ప్రియాంకాగాంధీ ఈసారి ఐదు లక్షలకు పైగా మార్జిన్‌తో గెలిచేలా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న ప్రియాంకాగాంధీని ఢీకొట్టేందుకు కోజికోడ్ మున్సిపల్ మహిళా కార్పొరేటర్ నవ్య హరిదాస్‌ను బీజేపీ రంగంలోకి దించుతుండగా సీపీఐ తరపున గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన సత్యన్ మోకేరి పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed