రిలీఫా.. రిస్కా..! ఈడీ ఉచ్చులో కవిత చిక్కారా?

by Sathputhe Rajesh |
రిలీఫా.. రిస్కా..! ఈడీ ఉచ్చులో కవిత చిక్కారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత విచారణ నుంచి రిలీఫ్ పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఆమె ఫోన్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఐఎంఈఐ నంబర్లతో సహా ఏడాది కాలంలో కవిత వాడిన ఫోన్ల వివరాలను గతంలో స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో ఈడీ పేర్కొన్నది. ఆ ఫోన్లతో పాటు గతేడాది అక్టోబరు నుంచి వాడుతున్న ఫోన్‌ను కూడా ఈ నెల 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఆమె హ్యాండ్ ఓవర్ చేశారు.

ఈ ఫోన్లతో ఈడీ చార్జిషీట్లలో పేర్కొన్న ఐఎంఈఐ నంబర్లు మ్యాచ్ అయ్యాయా? లేదా? అనే చర్చ కొనసాగుతూనే ఉన్నది. అందులోని డిజిటల్ ఎవిడెన్సులు పదిలంగా ఉన్నాయా..? లేక డిలీట్ అయ్యాయా? అనేదానిపై ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికిప్పుడు ఈడీ ఈ వివరాలను బహిర్గతం చేయకపోయినా రానున్న కాలంలో వెల్లడికానున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూపులో కవిత సభ్యురాలిగా ఉన్నదని ఆమె ఏడాది కాలంలో పది ఫోన్లు మార్చారని, డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేశారని చార్జిషీట్లలో ఈడీ పేర్కొన్నది. అవన్నీ ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి చేస్తున్న ఆరోపణలే అంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌కు కవిత ఈ నెల 21న రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. కవిత వాడిన పది మొబైల్స్ ఇప్పుడు ఈడీ చేతికి చేరాయి.

మంగళవారం కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయన సమక్షంలో ఈడీ అధికారులు కవిత ఇచ్చిన ఫోన్లను ఓపెన్ చేశారు. ఆ ఫోన్లలో ఈడీ ఆశిస్తున్న ఎవిడెన్సులు ఉన్నాయా? వాటిలోని డేటా పదిలంగా ఉన్నదా? లేక డిలీట్ అయిందా? ఆమె హాండ్ ఓవర్ చేసిన ఫోన్లు గతంలో ఆమె వాడినవేనా? ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి.

వీటిపై అటు ఈడీ అధికారులు గానీ, ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్‌‌ గానీ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఆ ఫోన్లలో ఈడీ అధికారులు తీసుకున్న డాటా వివరాలను న్యాయవాదికి చూపించారని, అందులోంచి ఏయే విషయాలు తీసుకున్న విషయాలను ఆయన వివరించి సంతకం తీసుకున్నట్టు తెలిసింది. ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ వ్యవహారంలో వివరాలు వెలుగులోకి రావాల్సి ఉన్నది.

ఈడీ ఆరోపించినట్టుగానే ఏడాది కాలంలో పది ఫోన్లను వాడింది నిజమేనని వాటిని హాండ్ ఓవర్ చేయడం ద్వారా కవిత తనంతట తానుగా ఓప్పుకున్నట్టయింది. కవిత వాడిన ఫోన్లలోని కొన్ని వివరాలను ఇప్పటికే (ఫోన్లను అప్పగించకముందే) ఈడీ సేకరించింది. వాటి ఆధారంగానే చార్జిషీట్లలో కొన్ని అంశాలను పొందుపరిచింది. ఫోన్లలోని డిజిటల్ ఎవిడెన్సులను ఆమె ధ్వంసం చేశారని ఇప్పటివరకూ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈడీ పకడ్బందీగా వ్యవహరిస్తున్నది.

ఫోన్లు సమర్పించడం ద్వారా కవిత రిలీఫ్ పొందుతారా? లేక ఆమెను మరింత రిస్కులోకి తీసుకెళ్లాలనే ఈడీ వ్యూహంలో చిక్కుకున్నారా? అనేది కీలకంగా మారింది. తమ దగ్గర ఇప్పటికే ఉన్న డాటా ఈ ఫోన్లలో లేదని, డిలీట్ అయిపోయిందని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని ఈ ఆధారాలతో ఈడీ కోర్టులో రుజువు చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆమె తరఫు న్యాయవాది సమక్షంలోనే డాటాను తీసుకున్నందున లీగల్ చిక్కులు లేకుండా ఈడీ జాగ్రత్తపడింది. ఆమె ఫోన్లను ఓపెన్ చేసిన తర్వాత లిక్కర్ స్కామ్‌ దర్యాప్తుకు ఉపయోగపడే ఆధారాలు, డాక్యుమెంట్లు, చాటింగ్, స్క్రీన్ షాట్లు ఏమేం లభ్యమయ్యాయన్నది సస్పెన్స్.

ఒక మహిళ ఫోన్‌లోకి ఈడీ అధికారులు చొరబడ్డారని, తన హక్కులకు భంగం కలిగించారని, వ్యక్తిగత గోప్యత హక్కుకు విఘాతం ఏర్పడిందని ఇప్పటికే కవిత వ్యాఖ్యానించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తరఫు న్యాయవాది సమక్షంలోనే ఆ ఫోన్లలో ఉన్న ఏ డాటాను తీసుకున్నదీ ఆయన నుంచి సంతకం తీసుకుని స్వాధీనం చేసుకున్నది.

ఆమె వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలు, డాక్యుమెంట్లు తీసుకోలేదని కోర్టుకు వివరించేలా జాగ్రత్తపడింది. మహిళగా ఆమె వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘించలేదని రూఢీ చేసేలా ఈడీ వ్యూహాత్మంగానే వ్యవహరించింది. ఫోరెన్సిక్ వింగ్ ద్వారా డాటా రికవరీ చేయిస్తుందా?.. డిలీట్ అయిన వివరాలను కూడా రాబడుతుందా..? వీటిపై ఈడీ నుంచి స్పష్టత లేదు.

“పది ఫోన్లు ఇవిగో.. ఐఎంఈఐ నంబర్లతో సహా అన్నీ ఇచ్చేస్తున్నాను..” అంటూ ప్లాస్టిక్ కవర్లలో మీడియాకు చూపించిన తర్వాత రెండు పేజీల లేఖతో పాటు ఈడీకి వాటిని కవిత హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేయడం ద్వారా పది ఫోన్లను వాడింది నిజమేనని అంగీకరించడంతో పాటు వాటిలోని ఎవిడెన్సు విషయంలో మరింత రిస్కులోకి పోతున్నారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ ఫోన్ల వ్యవహారం తర్వత ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వీటిలోని ఆధారాలతో రానున్న రోజుల్లో ఎంక్వయిరీలో మరిన్ని అదనపు ప్రశ్నలను ఆమె ఫేస్ చేయాల్సి ఉంటుందేమోననే అనుమానాలు ఆమె అభిమానుల్ల లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed