భూపాలపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్

by Prasanna |
భూపాలపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్
X

దిశ, కాటారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడుతోందని, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెండు రోజులు జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడీఓలు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిందని జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అత్యవసరమైతే తప్ప ప్రజలుఇండ్ల నుండి బయటకి రావొద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వరద నీరు చేరి ప్రమాదకరంగా ఉన్న రహదారుల్లో ప్రయాణాలు చేయొద్దని అట్టి రహదారుల్లో రవాణా నియంత్రణకు భారికేడింగ్, ట్రాక్టర్లు వంటి వాహనాలు అడ్డుపెట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. చెరువులు పటిష్ఠతను పరిశీలిస్తూ పరి రక్షణ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, నదులు, చెరువులను చూసేందుకు ప్రజలు వెళ్ళొద్దని ప్రమాదం పొంచిఉందని ఆయన తెలిపారు.

వర్షాలు తగ్గే వరకు వ్యవసాయ కూలీలు పనులకు వెళ్ళొద్దని తెలిపారు. పశువులను మేతకు వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, ముంపు గ్రామాల్లో ఎత్తైన ప్రదేశంలో పశువులు ఉంచాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విపత్తువేళ ప్రజల రక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా వాగులు, చెరువుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఏదైన అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టరేట్ నందు 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేసిన 9030632608, 18004251123 కంట్రోల్ రూము నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed