Raithu Bharosa: ‘రైతు భరోసా’ అనర్హత జాబితా సిద్ధం! పంచాయతీల్లో డిస్‌ప్లే చేసేందుకు కసరత్తు

by Shiva |
Raithu Bharosa: ‘రైతు భరోసా’ అనర్హత జాబితా సిద్ధం! పంచాయతీల్లో డిస్‌ప్లే చేసేందుకు కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో రైతుభరోసా అందని భూముల వివరాలను, గ్రామాల వారిగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. డిటైల్స్‌ను పంచాయతీ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6వేల ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని.. అయితే, సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే సాయం ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పంటలు పండించని భూమలు వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

పారదర్శకత కోసం..

రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదిలీ చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూముల వివరాలను బహిరంగ పరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ జాబితాలో కొండలు, గుట్టలు, వెంచర్లు, మైనింగ్ గనులు, రోడ్లు, ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాంటి భూముల వివరాలను గ్రామాల వారిగా, స్థానిక పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే చక్కదిద్దే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ‘ఈ నెల 20 తరువాత గ్రామాల వారిగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను పంచాయతీ ఆఫీసుల్లో డిస్ ప్లే చేయాలని అనుకుంటున్నాం. దీంతో భూములు వివరాలు అందరికీ తెలుస్తాయి’ అని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్స్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలను సేకరిస్తున్నారు. అందుకోసం క్షేత్ర స్థాయి రిపోర్టులను కూడా తీసుకుంటున్నారు.

ఇక్రిశాట్ సహకారం?

సాగుకు యోగ్యం లేని భూమలు వివరాలను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో రెండు శాఖల ఆఫీసర్లు ఇదే పనిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో సాగుకు ఉపయోగం లేని భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయోనని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే.. సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను సేకరించే సమయంలో శాటిలైట్ డేటాతో సరిపోల్చనున్నారు. సాగవుతున్న భూములేంటి..? ఆ భూముల సర్వే నంబర్లు ఏంటి..? అందులో కొండలు, గుట్టలు, రోడ్లు, పడావు భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వివరాలను హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

15 లక్షల ఎకరాలకు భరోసా కట్!

రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది. అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ మెజార్టీ భూములు వెంచర్లు, రోడ్ల కింద సేకరించినవి, అవుటర్ నిర్మాణం కోసం తీసుకున్నవి, ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించినవి ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్, సాగు యోగ్యం లేని వాటికి, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతుబంధు అందించారు. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా విధానానికి తెరతీసింది.

Advertisement

Next Story

Most Viewed