రసవత్తరంగా మిర్యాలగూడ పాలిటిక్స్.. ఎమ్మెల్యే సీటుపై నో క్లారిటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-24 04:49:42.0  )
రసవత్తరంగా మిర్యాలగూడ పాలిటిక్స్.. ఎమ్మెల్యే సీటుపై నో క్లారిటీ!
X

దిశ, మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ మిర్యాలగూడ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎమ్మెల్యే సీటుపై బీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు క్లారిటీ లేదు. తొంభై తొమ్మిది శాతం సీట్లు సిట్టింగులకే అంటూ బీఆర్ఎస్ అధినేత అభయం ఇస్తున్నా... కమ్యూనిస్ట్‌లతో పొత్తు అనుమానాలకు తావిస్తోంది. ముచ్చటగా మూడో సారి గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేసుకుంటుండగా జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్‌కి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు కీలకంగా మారింది.

ఈ పరిస్థితుల్లో గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీఎం స్థానం కోసం పట్టుబట్టే ఛాన్స్ ఉంది. పొత్తుల్లో నియోజకవర్గం బీఆర్ఎస్‌కా సీపీఎంకా అనే అంశం సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ పట్ల కొద్దో గొప్పో ప్రజాభిమానం ఉన్నప్పటికీ అసలు నాయకుడెవరో తేలక క్యాడర్ ఆందోళన చెందుతుండగా, ప్రజాదరణ పెద్దగా లేని బీజేపీకి సినీనటిని ఇన్‌చార్జిగా నియమించడం అసంతృప్తి రగిలిస్తోంది.

ఆసక్తిగా మారిన బీఆర్ఎస్, సీపీఎంల పొత్తు

మిర్యాలగూడ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం‌పై మంచి పట్టు సాధించారు. నిత్యం నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు వందల కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు. దీనికి తోడు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది.

ఎన్నికల సమాయత్త చర్యల్లో భాగంగా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ నెల 25నుంచి మాడ్గులపల్లిలో ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించి నియోజకవర్గం అంతటా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తులో మిర్యాలగూడ స్థానం సీపీఎం పార్టీకి కీలకం. పొత్తులో సీటు తమకే దక్కుతుందన్న ఆశతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి నియోజకవర్గ సమస్యలపై ప్రజా పోరాటాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

కాంగ్రెస్‌లో నైరాశ్యం

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మొదటి సారి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు. అయినప్పటికీ ఇప్పటికి గ్రామాల్లో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో సామజిక వేత్త బత్తుల లక్ష్మా రెడ్డి మూడు రోజుల ముందు కాంగ్రెస్‌లో చేరి 18వార్డులు గెలిపించుకున్నారు. అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి‌ల వర్గ పోరుతో సీటు ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితి.

దీంతో ఎవరివైపు నడవాలో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. కాగా ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి నాయకుల విభేదాలపై భేటీ నిర్వహించి సంధి కుదిర్చారు. దీంతో ఈ నెల 26నుంచి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లక్ష్మా రెడ్డి వేములపల్లి మండలం ఆమనగళ్లు నుంచి చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా యాత్రకు బీఎల్అర్ సన్నాహాలు చేస్తున్నారు.

చాప కింద నీరులా బీజేపీ..

కాంగ్రెస్ వర్గ పోరు నడుమ బీజేపీ నాయకులు చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జి సినీ నటి కవితతో పాటు అసెంబ్లీ ప్రభారీ లచ్చి రెడ్డిలు స్థానిక నాయకుల సహకారంతో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేర్చుతున్నారు. గ్రామ గ్రామాన కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి బీజేపీ విధానాలు ప్రజలకు వివరిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు‌కు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ప్రజలకు చేరువయ్యేందుకు విస్తృత కార్యక్రమాలు

ఎప్పుడు ఎన్నికలోచ్చిన సిద్దంగా ఉండాలని ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గంలో పర్యటించాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలకు చేరువయ్యేందుకు సంసిద్దులు అవుతున్నారు. ఈ నెల 25నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మా రెడ్డి 26 నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభిస్తున్నారు. ఏ సమీకరణం మారి ఎవరికి లక్కు దక్కుతుందో అనే ఆశతో ఎవరికి వారు ప్రజాభిమానం పొందెందుకు పావులు కదుపుతున్నారు.

ఇవి కూడా చదవండి: నిరుపయోగంగా క్రీడాప్రాంగణాలు

Advertisement

Next Story

Most Viewed