కంటే కూతుర్నే కనాలనిపించే ఘటన...ఈ కథ వింటే కళ్లు చెమ్మగిల్లాక తప్పదు

by Kalyani |   ( Updated:2024-11-19 15:36:59.0  )
కంటే కూతుర్నే కనాలనిపించే ఘటన...ఈ కథ వింటే కళ్లు చెమ్మగిల్లాక తప్పదు
X

దిశ, బడంగ్ పేట్​ : వృద్దాప్యంలో సేవలు చేయలేక తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలిపెడుతున్న వారు కొందరయితే...ఆస్తుల కోసం కని పెంచిన తల్లిదండ్రులనే హతమారుస్తున్న మరి కొందరు...దీనికి భిన్నంగా మానసిక స్థితి సరిగా లేక తప్పిపోయిన కన్నతండ్రి కోసం ఆరేళ్ళుగా వెతుకుతున్న కూతుళ్ళకు ఓ అనాథ ఆశ్రమంలో కనిపించడంతో ఉబ్బితబ్బిపోయారు. తన భర్తను, అత్తమామలను ఒప్పించి మరీ తన తండ్రిని అత్తగారింటికి తీసుకెళ్ళిన కూతుళ్ళు మరెందరికో ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా లింగాల తాలుక బాకారం గ్రామనివాసులు దేరంగుల బాలయ్య (58) ఇరవై ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు.

బాలయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు దివ్య, లావణ్యలు, కుమారుడు సంతానం. దీంతో కుమారుడు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. బాలయ్య మేస్త్రి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సాయంత్రం వేళలో కంపౌండ్​ లో కల్లుకు అలవాటు పడ్డాడు. కల్తీ కల్లుతో అతని మానసిక స్థితిపై దెబ్బపడింది. దీంతో ఆరేళ్ల క్రితం బాలయ్య ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిగాయి. పెద్ద కూతురు దివ్య అత్తగారింట్లోనే తన తల్లిని సైతం పెట్టుకుని సేవలు చేస్తుంది. తప్పి పోయిన తండ్రి కోసం ఆరేళ్లుగా కూతుళ్లు దివ్య, లావణ్యలు వెతకని చోటు లేదు. అనాథ ఆశ్రమాలలో సైతం తన తండ్రి దొరకాలని అన్నదానాలు సైతం చేశారు.

మాసిన బట్టలతో రోడ్డుపై ఉన్న బాలయ్యను చేరదీసిన మాతృదేవోభవ అనాథశ్రమం....

ఆరేళ్ల క్రితం జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో దీనస్థితిలో పడుకొని ఉన్న బాలయ్యను చూసి మాతృదేవోభవ అనాధాశ్రమం ఫౌండర్ గట్టు గిరి ఆధ్వర్యంలో ఆశ్రమంలో చేర్పించారు. మానసిక స్థితి సరిగా లేని అతనికి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స ను అందించగా ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడసాగింది. అతని గురించి వివరాలు అడుగగా ఇరవై ఏండ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి మేస్త్రి పని చేస్తున్నాని మాత్రమే చెప్పగలిగాడు. సరైన వివరాలు లేకపోవడంతో ఇంటికి పంపించలేక పోయారు ఆశ్రమ నిర్వాహకులు. నెలరోజుల క్రితం బాలయ్య కూతుర్లు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్న అభాగ్యులకు అన్నదానం నిర్వహించడానికి ఆశ్రమానికి వచ్చారు. తమ తండ్రి తప్పిపోయాడని, ఆరేళ్లుగా వెతుకుతున్నామని కూతుళ్లు దివ్య, లావణ్యలు తెలిపారు. అనాథ ఆశ్రమంలో నెల రోజుల క్రితం తండ్రిని చూసిన గుర్తు పట్టలేక పోయారు.

మరోసారి అన్నదానం చేయడానికి తన తండ్రి బాలయ్య ఫైల్​ ఫొటోను తీసుకుని మాతృదేవోభవ ఆశ్రమానికి వచ్చారు. అనుకోకుండా ఒక్కసారిగా బాలయ్య ను చూసి గుర్తుపట్టిన వారి కూతుర్లు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తమ తండ్రి కోసం తాము వెతకని చోటు లేదని మళ్ళి చుస్తామనుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. ఆరేళ్ల క్రితం మాతృదేవోభవ అనాథశ్రమం నిర్వాహకులు గట్టు గిరి తన తండ్రిని ఆశ్రయం కల్పించకపోతే మాకు దక్కేవాడు కాదన్నారు. తమ తండ్రిని ఆరోగ్యంగా తమకు అప్పగించిన ఆశ్రమం ఫౌండర్ గిరికి జీవితాంతం రుణపడి ఉంటామని, ప్రతి నెలా అన్నదానం చేస్తామని ప్రకటించారు. తన తండ్రి తిరిగి తమకు దొరకాడని, ఇంటికి తీసుకువస్తానని అందరిని ఒప్పించి మరీ బాలయ్యను కూతురు దివ్య అత్తగారింటికి తీసుకెళ్లింది. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed