సీలింగ్ ల్యాండ్‌లోనిర్మాణాలు.. అనుమతులు లేకున్నా తవ్వకాలు

by samatah |
సీలింగ్ ల్యాండ్‌లోనిర్మాణాలు.. అనుమతులు లేకున్నా తవ్వకాలు
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో ఎక్కడచూసినా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపలే కాదు బయట కూడా ఎకరాకు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి. మొన్నటికిమొన్న నియోపోలీస్‌లో ప్రభుత్వ స్థలాలు ఎకరాకు వంద కోట్లకు పైగా ధర పలికిన విషయం తెలిసిందే. ఇక గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉంటాయో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న భూములను మాత్రం కొందరు అక్రమార్కులు అప్పనంగా కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీలింగ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చెవుడుతున్నారని తెలిసింది. కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి, జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయంటూ అధికారులను తప్పుదారి పట్టిస్తూ సీలింగ్ భూముల్లో కొందరు బిల్డర్లు పాగా వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూములకు ఎసరు..?

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కంటిన్యూ అవుతూనే ఉంది. కోట్లాది రూపాయల సర్కార్ స్థలాలు, అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో చేరుతున్నాయి. కొందరు కబ్జారాయుళ్లు పక్కాగా సర్కార్ స్థలాలని తెలుసుకుని యథేచ్ఛగా అందులో పాగా వేస్తున్నారు. చెరువు శిఖాలు, పోరంబోకు భూములు, ఏళ్ల తరబడి ఎలాంటి కంచెలు లేని జాగాలపై కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఇలాంటి వారికి కొందరు నాయకులు, ఇంకొందరు అధికారులు సపోర్ట్ చేస్తుండడంతో ఈ కబ్జాల పరంపర ఎంచక్కా సాగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, నోటీసులు ఇచ్చినా అవి బుట్టదాఖలు అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లింగ్ భూముల్లో నిర్మాణం..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నెంబర్ 110లో 9.04, సర్వే నెంబర్ 111లో 1.09 ఎకరాల అభి ఎక్ పైస్లా పట్టా, 112లో 1.10 ఎకరాలు సర్కారీ, సర్వే నెంబర్ 113/1లో 8.26 ఎకరాల ప్రొహిబిటెడ్ ల్యాండ్, సర్వే నెంబర్ 113/2లో 8.26 ఎకరాల నిషేధిత భూములు ఉన్నాయి. ఇవేగాక పలు సర్వే నెంబర్లు నేటికి నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. కొన్ని భూముల్లో నిర్మాణాలు కట్టేయగా, కొన్ని స్థలాల్లో బహుళ అంతస్థుల భవనాలు పునాదుల దశలో ఉన్నాయి. ఇందులో సర్వే నెంబర్ 111లో సీలింగ్ ల్యాండ్ ఉందని చెబుతూ ఇటీవల రెవెన్యూ అధికారులు నిర్మాణాన్ని నిలిపివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నిర్మాణం సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే సర్వే నెంబర్ 113/1, సర్వే నెంబర్ 113/2 లోనూ సీలింగ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ భూముల్లో ఓ బిల్డర్ నిర్మాణాన్ని చేపట్టాడు.

వివాదాస్పద భూములే బెటర్..

కొందరు బిల్డర్లు, రియలెస్టెస్ వ్యాపారులు ప్రభుత్వ భూములు, చెరువు శిఖాలు, సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణాలు చేపట్టడంలో మంచి నైపుణ్యం సాధిస్తున్నారు. ఈ భూములు తక్కువ ధరకు రావడం, వివాదాస్పద భూములు అయితే తమ పలుకుబడితో అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయవచ్చు అనే ధీమాతో ఇలాంటి స్థలాలను ఏరికోరి మరీ ఎన్నుకుని నిర్మాణాలు సాగిస్తున్నారు. గచ్చిబౌలిలో సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణాలు సాగిస్తున్న బిల్డర్ గతంలో కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోనూ ఓ చెరువు శిఖంలో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించారన్న ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. ప్రస్తుతం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్‌లోని ఓ సీలింగ్ ల్యాండ్‌లో దాదాపు 570 గజాల స్థలంలో తాజా నిర్మాణానికి శ్రీకారంచుట్టడం గమనార్హం. అది సీలింగ్‌లో ఉన్న భూమి అని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నిర్మాణాలు ఆపాలని చెప్పినా సదరు బిల్డర్ మాత్రం తగ్గేదే లేదంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేవని అంటే హెచ్‌ఎండీఏ వద్ద తెచ్చుకున్నామని చెబుతూ పనులు మాత్రం కొనసాగిస్తున్నారు.

అది సీలింగ్ భూమి..

- ఆర్ఐ శ్రీకాంత్

గచ్చిబౌలి గ్రామంలో పలు సర్వే నెంబర్లలో సీలింగ్ భూములు ఉన్నాయి. వాటిలో ఓ బిల్డర్ నిర్మాణాలు సాగిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. వాటిని వెంటనే ఆపాలని ఆదేశించాం. బుధవారం మా సిబ్బందితో అక్కడికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న వారిని అడ్డుకున్నాం. మళ్లీ నిర్మాణాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed