నోటీసులతోనే కాలయాపన.. చర్యలు తీసుకోవడంలో జంకుతున్న అధికారులు!

by Anjali |
నోటీసులతోనే కాలయాపన.. చర్యలు తీసుకోవడంలో జంకుతున్న అధికారులు!
X

దిశ రంగారెడ్డి బ్యూరో: జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం పెత్తనం భారీగా పెరిగిపోయింది. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ప్రైవేట్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పెట్టుబడిదారుల పాత్ర కీలకంగా ఉండడంతో విద్యాశాఖ అధికారులు వారికి మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్లు ఏర్పాటు చేసుకుంటే చిత్ర హింసలకు గురి చేసి, ఆ స్కూల్ మూసివేసే వరకు అధికారులు వెంటపడతారు. ఇలాంటి దుస్థితి రంగారెడ్డి జిల్లాలో నెలకొంది. అయితే ప్రభుత్వ స్కూళ్లపై చూపించాల్సిన ప్రేమను విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్ల పైన చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇటీవల కాలంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, సరూర్ నగర్, బాలాపూర్ మండలాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నిబంధనల ప్రకారం 15 రోజుల్లో స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించినప్పటికీ ఏ ఒక్క స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం. ఈ స్కూళ్లపైన చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు టీచర్ల బదిలీల సాకుతో ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు.

ఈ స్కూళ్లపై మమకారం ఎందుకు?

జిల్లాలోని యాచారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య స్కూల్, ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గ్రామంలోని శ్రీ చైతన్య స్కూల్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమసిపేటలోని ఎక్స్‌లెన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంజాపూర్‌లోని అకడమిక్ హైట్స్ స్కూల్, సరూర్ నగర్‌లోని నారాయణ, కృష్ణవేణి స్కూల్స్, బాలాపూర్‌లోని లాట్ ఎల్వోఆర్‌డీఎస్ తదితర స్కూళ్లలో కొన్నింటికి నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు. కానీ ఆ స్కూళ్లపై విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవడంలో అధికారులు నిరాకరిస్తున్నారు. అదేవిధంగా సీజ్ చేసిన స్కూళ్లను తిరిగి ప్రారంభించుకునేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం సాగుతున్నది. ప్రధానంగా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని విద్యాశాఖ అధికారి ఇన్జాపూర్‌లోని అకడమిక్ హైట్స్ స్కూల్, తామతిపేటలోని ఎక్సలెన్సీ స్కూళ్లపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు విద్యా హక్కు చట్టం, రూల్ 14 ప్రకారం స్కూల్ యాజమాన్యంపై జరిమానా విధించాలి. కానీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు.

కలెక్టర్ సార్ పట్టించుకోరా..?

జిల్లా విద్యాశాఖ అధికారులపై ఉన్నతాధికారులు దృష్టిసారించడంలేదన్న ఆరోపణలున్నాయి. రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారుల తీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ముఖ్యంగా కలెక్టర్ చర్యలు తీసుకుంటే తప్ప జిల్లాలో విద్యా వ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకొని, జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed