Quick Commerce: ఒక్క ఏడాదిలో మూతబడిన 2 లక్షల కిరాణా స్టోర్లు

by S Gopi |
Quick Commerce: ఒక్క ఏడాదిలో మూతబడిన 2 లక్షల కిరాణా స్టోర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ కంపెనీల హవా జోరుగా సాగుతోంది. వినియోగదారులు బ్లింక్ఇట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆర్డర్లు చేసేందుకు ఇష్టపడుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల పరిశ్రమల సంఘం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్(ఏఐసీపీడీఎఫ్) మార్కెట్ అధ్యయనం ప్రకారం.. క్విక్ కామర్స్ కంపెనీల కారణంగా గడిచిన ఏడాది కాలంలో కనీసం 2 లక్షల కిరాణా స్టోర్లు, చిన్నా చితక రిటైల్ ఔట్‌లెట్లు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1.3 కోట్ల స్టోర్లు క్విక్ కామర్స్ వల్ల ప్రభావితమయ్యే అంశాల గురించి ఏఐసీపీడీఎఫ్ సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని కిరాణా స్టోర్లపై క్విక్ కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని పరిశ్రమల సంఘం తెలిపింది. మూతపడిన రెండు లక్షల స్టోర్లలో 45 శాతం మెట్రోల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టైర్-1 నగరాల్లో 30 శాతం, టైర్-2, టైర్-3 నగరాల్లో 25 శాతం దుకాణాలు కనుమరుగయ్యాయి. దాదాపు 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్విక్ కామర్స్ రంగం మెట్రోల్ మార్కెట్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. అందుకే ఈ ప్రాంతాల్లోనే మూసివేతలు ఎక్కువగా జరుగుతున్నాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ తెలిపారు. క్విక్ కామర్స్ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా స్టోర్ల కస్టమర్ బేస్, లాభదాయకతను దెబ్బతీస్తున్నాయన్నారు. అంతేకాకుండా అధిక డిస్కౌంట్లు, తక్కువ ప్రైసింగ్ వంటి అంశాల్లో అన్యాయమైన విధానాలను క్విక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్నాయని పరిశ్రమల సంఘం నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed