నకిలీ పాల పదార్థాల తయారీకి కేంద్రంగా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ..

by Sumithra |
నకిలీ పాల పదార్థాల తయారీకి కేంద్రంగా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ..
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : నకిలీ పాల పదార్థాల తయారీ కేంద్రంగా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ మారుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికారులు కూడా పలుమార్లు తనిఖీలు చేసి వార్నింగ్లు ఇచ్చిన సదరు కంపెనీ యజమానులు తీరు మార్చుకోవడం లేదు. ఏడాది కాలంలో ఒకే కంపెనీ పై రెండు సార్లు తనిఖీలు నిర్వహించినప్పటికీ అధికారులే తప్పుగా వ్యవహరిస్తున్నారంటూ సదరు యజమాన్యం, వారి సిబ్బంది చేస్తున్న ఆరోపణలతో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల గ్రామ శివారులో ఉన్న పాలతో పాటు పాలపదార్థాల కంపెనీలో సంవత్సర కాలంలో రెండుసార్లు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత వాతావరణంతో పాటు నాణ్యత లేని పాల పదార్థాలు తయారు చేస్తున్నారని శాంపిళ్లను సేకరించి ఉన్నతాధికారులకు పంపించి రిపోర్టు తీసుకున్నా కూడా సదరు పాల కంపెనీ యజమాన్యం తీరులో మాత్రం మార్పు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో సదరు యజమాన్యం కుటుంబ సభ్యులకు పాడి పరిశ్రమలో ఉన్నత రైతులుగా పేరు వచ్చింది. కాని ప్రస్తుతం నిర్వహణ చేసిన యజమానులు ఆ పేరును పోగొట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాల పదార్థాలను తయారు చేయడంలో నాణ్యత పూర్తిగా కొరవడుతోందని సదరు పాల కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలోనే పలువురు ఫిర్యాదులు చేశారు.

గొప్యంగా ఉంచిన శాంపిల్ రిపోర్ట్..

పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సంబందించిన అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి శాంపిళ్లను పంపించారు. కానీ శాంపిల్ రిపోర్టు ఏ విధంగా ఉందో ఇంక బహిరంగంగా అధికారులు వెల్లడించలేదు. రిపోర్టు ఇంకా రాలేదా వచ్చినా కూడా బహిరంగంగా వెల్లడించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాల్సి ఉంది. దాడులు చేసిన విషయాలను ఫోటోలతో సహా ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేసినప్పటికీ దానికి సంబంధించిన పరిణామాలను పూర్తి వివరాలు మాత్రం సంబంధిత అధికారులు వెల్లడించడంలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత పాల కంపెనీ పై నాణ్యత లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాడులతో పాటు నాణ్యత పరమైన విషయాలను తెలుసుకునేందుకు 'దిశ' సదరు పాల కంపెనీ యజమానులను వివరణ కోరెందుకు పలుమార్లు సంప్రదించినా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Next Story

Most Viewed