జోనల్ కమిషనర్‌గా ఉన్నత స్థాయి అధికారి ఉన్నప్పటికి ఆగని అక్రమ నిర్మాణాలు

by Mahesh |
జోనల్ కమిషనర్‌గా ఉన్నత స్థాయి అధికారి ఉన్నప్పటికి ఆగని అక్రమ నిర్మాణాలు
X

దిశ, చైతన్య పురి: ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది జిహెచ్ఎంసి పనితీరు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్నతస్థాయి అధికారి వచ్చినా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. జీహెచ్ఎంసీ స‌రూర్‌న‌గ‌ర్‌ స‌ర్కిల్ -5లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేదు. ఎవరికి నచ్చినట్టు వారు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. క‌మిష‌న‌ర్ అమ్రాపాలి టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలు చుస్తే స‌రూర్‌న‌గ‌ర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలసత్వానికి అల‌వాటు ప‌డిన స‌ర్కిల్, జోన‌ల్ స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణ‌దారుల పట్ల ఉదాసినంగా ఉంటుండడంతో నిర్మాణం దారులు అనుమతి ఒకలా తీసుకుని నిర్మాణం మరొక లాగా చేస్తున్నారు. అధిక మొత్తంలో వ‌సూళ్లు చేస్తూ అక్ర‌మ నిర్మాణాల‌ను ప్రోత్సహిస్తున్నార‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

ఎక్కడ..

కొత్తపేట డివిజన్ లోని ఎల్బీనగర్ నుండి నాగోల్ వెళ్లే ప్రధాన రహదారిపై శివగంగా కాలనీలో ఒక నిర్మాణం దారుడు 221 గజాలలో స్టిల్ట్ ప్లస్ 2 అనుమతులు తీసుకుని స్టిల్ట్ ప్లస్ 3 నిర్మాణం చేశారు. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని కమర్షియల్ నిర్మాణం చేస్తున్నాడు. క‌నీస నియ‌మనిబంధ‌న‌లు పాటించ‌కుండా సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణ ప‌నుల‌ను సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. కారణం టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులకు ఆశపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం లేదని సామాజిక కార్యక‌ర్తలు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నార‌ని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూడు నోటీసులు ఇచ్చేసరికి నిర్మాణం పూర్తవుతుందని తద్వారా అక్రమ నిర్మాణం పై చర్యలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, జోనల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి అవినీతి, అక్రమాల‌ను ప్రోత్సహిస్తున్న స‌ర్కిల్‌-5 టౌన్ ప్లానింగ్ అధికారుల‌పై చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

డిసి వివరణ..

ఈ విషయమై సర్కిల్ 5 డిప్యూటీ కమిషనర్ సుజాత శ్రీధర్ ను వివరణ కోరగా సంబంధిత నిర్మాణం దారుడికి ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed