- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జానే!
దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం, అధికారులు పనిచేస్తారనే మాట కంటి చూపు మేరలో కనిపించడం కష్టంగా మారిపోయింది. రాజకీయ ప్రభావం, ఒత్తిళ్లతో అధికారులు పనిచేయడం పరిపాటిగా మారింది. అధికారం ఏ పార్టీ ఉంటే ఆ నేతలకు వంతపాడడమే ప్రభుత్వ అధికారుల విధిగా మారినట్లు స్పష్టమవుతున్నది. గత ప్రభుత్వంలో అందినకాడికి భూములను దోచుకుంటున్నారనే ఈనాటి ప్రభుత్వ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. కానీ నేటి ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల ఆగడాలు షూరువైనట్లు కనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, భూదాన్ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టి అధీనంలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. కానీ ఆ భూములను కాపాడడం దేవుడెరుగు.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములు బడా వ్యాపారులు రాజకీయ ప్రభావంతో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడం పై అనుమానాలకు ఊతమిస్తున్నది. జిల్లాలో కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా ఆక్రమిస్తుంటే పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.
కొండలు, గుట్టలు గాయబ్..
ప్రభుత్వం, అసైన్డ్, సీలింగ్ భూములను ఆసరాగా చేసుకొని పట్టా భూములను కొనుగోలు చేసి రియల్ వ్యాపారం సాగిస్తున్నారు. మరికొంత మంది వ్యాపారులు అధికారులను ప్రభావితం చేసే రాజకీయ నేతల అండదండలతో ఏకంగా అసైన్డ్, సీలింగ్ భూములను కొనుగోలు చేస్తున్నారు. అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పట్టా భూములుగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ నేతలకు అండగా పనిచేస్తూ ప్రభుత్వ భూములను కాజేశారని గగ్గోలు పెట్టారు. నేడు అదే అధికారులు ఏ పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారో అర్థం కావడం లేదు. అబ్ధుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, గండిపేట్, మహేశ్వరం, కందుకూర్మండలాల పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, కొండలు, నాలాలు, కాల్వలు నిబంధనలకు విరుద్ధంగా నాశనం చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడినా వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయాలి. కానీ ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా తూతూమంత్రంగా పనులు నిలిపివేయడం, ఆ తర్వాత యథావిధిగా పనులు ప్రారంభించడం అలవాటుగా మారిపోయింది. దీనంతటికీ కారణం ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, ఉన్నతాధికారుల లాలూచి పద్దతితోనే అక్రమాలు జరుగుతాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పట్టా భూములైతే నాశనం చెయోచ్చా...?
పట్టా భూములను క్రయ విక్రయాలను చేసుకోవచ్చు. కానీ పట్టా భూముల్లోనున్న కాల్వ, నాలాలు, కత్వాలు, కుంటలు, చెరువులు, కొండలు, గుట్టలను విధ్వంసం చేసే హక్క లేదని రెవెన్యూ చట్టం వివరిస్తుంది. ఈ చట్టాలను చదువుకున్న రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదనే వాదన తలెత్తుతుంది. ఒకవేళ అత్యవసరాల కోసం భూమిని పట్టాదారుడు విక్రయిస్తే కొనుగోలు దారుడు అదే పద్ధతిని అవలంభించాలి. అవేమీ తమకు వర్తించవనే విధంగా రైతు విక్రయించాడు... నేను కొనుగోలు చేశాను. నేను ఇష్టానుసారంగా నా భూమిలో వ్యవహారం చేసుకుంటాను అనే ధోరణిలో వ్యాపారులుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఉంది.... ఆ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ నడుస్తుంది... ఆ వ్యవస్థకు అనుగుణంగా భూ క్రయవిక్రయాలు, లావాదేవీలుంటాయనే సంగతీని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యే దుస్థితికి వస్తుంది. కొండలు, గుట్టలను పూర్తిగా నాశనం చేయడంతో వాతావరణంలో అనేక మైన మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో అతి స్వల్ప వర్షాలు కురిసినా మునిగిపోయే ప్రాంతాలున్నాయి. అన్నింటికీ కారణం ప్రకృతి సహజమైన వనరులను దెబ్బతీయడంతోనే విపత్తులు సంభవించే పరిణామాలు అనేకం.
వీటిపై చర్యలుండవు..
– శంషాబాద్ మండలం శంకరపురం గ్రామంలోని సర్వే నంబర్ 24 లో సుమారు 50 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ సర్వే నంబర్‌లో 20 ఎకరాల భూమి ఓ వ్యాపారి ఆక్రమించి లేఔట్ నిర్మిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు అధికారులు ఎందుకు జంకుతున్నారో అర్థం కావడం లేదు.
– అబ్ధుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం గ్రామ పంచాయతీ, తట్టి ఖానా రెవెన్యూ పరిధిలోని 38 సర్వే నంబర్‌లో గాల కుంట చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్తిగా పూడ్చి వేశారు. దీంతో చుట్టూ గుట్టలు, కొండలున్నాయి. వీటిపై పడిన వర్షపు నీరు నిలిచేది గాల కుంటలోనే.. భవిష్యత్‌లో కుంట లేకపోవడంతో ప్రస్తుతం నిర్మించే విల్లాలన్నీ నీట మునిగే ప్రమాదం ఉంది.
– అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్పురంలోని 281 సర్వే నెంబర్ లో సుమారు 357.39 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రభుత్వ, పట్టా, సీలింగ్ భూమి ఉంది. అయితే పట్టా భూమి క్రయవిక్రయాలు జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. కానీ ప్రకృతి సహాజమైన కొండలు, గుట్టలను పూర్తిగా నేలమట్టం చేసే కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా పట్టా భూమి పేరుతో పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసే కుట్ర జరుగుతుందని తెలుస్తున్నది.
– ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన 189 సర్వే నంబర్‌లో 180 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అయితే కొంతమంది రైతులు రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా ఓ రియల్ వ్యాపారికి భూమిని విక్రయించినట్లు తెలుస్తున్నది. రైతుల పేరు చెప్పి ఆ వ్యాపారులు సుమారు 150 ఫీట్ల వెడల్పు.. కిలోమీటర్ మేర పొడవు అందమైన రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయడం చట్టవ్యతిరేకమని రెవెన్యూ అధికారులు చెబితే ఆ వ్యాపారి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విధంగా ప్రభుత్వ భూములను అందినకాడికి దోచుకుంటున్నారు.