జనాలకు గాలం...చెరువుకు తాళం

by Sridhar Babu |

దిశ, పరిగి : పరిగి మున్సిపాల్టీతో పాటు హైవే రోడ్డు పొడవునా రియర్టర్లు రెచ్చిపోతున్నారు. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా రోడ్లు వేయడం, రాళ్లు పాతడం, ప్లాట్లు విక్రయించడం కొన్నేళ్లుగా సాగుతోంది. హైవే పక్కన ఉన్న చెరువులు, కుంటల్లో శిఖం భూములను కబ్జా చేయడం, కాలువలు, నాలాలను దారి మళ్లించడంలో రియల్టర్లకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా తయారైంది.

చెరువు, శిఖం భూమి అని తెలిసినా అనుమతులు ఇచ్చే అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడి సంతకాలు పెట్టేస్తున్నారు. ఎండా కాలంలో నాలుగు టిప్పర్ల మట్టి పోసి, రాళ్లు పాతి, రంగు రంగుల బ్రోచర్లతో హైవేను ఆనుకునే ప్లాట్లు అంటూ అమాయకులను ఆకట్టుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ పరిగి మండలం రూప్​ ఖాన్​ పేట్​ శివారులో పోసాని చెరువు శిఖం భూమిలో ఏర్పాటు చేసిన వీరభద్రనగర్​.

23 ఎకరాలకు మిగిలింది 5 ఎకరాలే...

పోసాని చెరువు 23.24 ఎకరాలకు గాను కబ్జా పోను మిగిలింది ఐదెకరాలే. రూప్​ ఖాన్​ పేట్​ గ్రామ శివారులో సర్వే నెంబరు 243లో శిఖం 23.34 భూమిలో సుమారు 60 ఏళ్ల క్రితం నుంచే ఈ పోసాన్​ చెరువు ఉంది. క్రమేపి ఈ చెరువును పోసాని చెరువుగా వాడుకభాషలో పిలుస్తుంటారు. ఈ చెరువు నిండి సమీపంలోని ఊర చెరువు, నిగని చెరువు, పటాన్​ చెరువుల్లోకి నీరు వెళ్తుంది. ఈ నాలుగు చెరువులు నిండి మిట్టకోడూర్​ చెరువులోకి నీరు వెళ్తుంది.

ఈ నాలుగు చెరువుల కింద సుమారు 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ చెరువును మిషన్​ కాకతీయ కింద సుమారు 20 లక్షల వరకు వెచ్చించి పూడిత, ఇతర అభివృద్ధి పనులు చేశారు. క్రమేపి ఈ చెరువు శిఖం భూముల్లో రియల్టర్లు ప్లాటు చేసి అమ్మడంతో 23.24 ఎకరాల విస్తీర్ణంలో మిగిలింది ఐదారు ఎకరాలే.

చోద్యం చూస్తున్న అధికారులు

పోసాని చెరువు శిఖం భూమిలో వీరభద్ర నగర్​...మరో నగర్​, సిటీ అంటూ లే అవుట్​ చేసి అమాయక ప్రజలను మోసం చేశారంటూ కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. హైవే రోడ్డు పక్కనే పోసాని చెరువు శిఖం భూమి ఉండటంతో మట్టితో రోడ్లు వేసి, కలర్​ ఫుల్​ బ్రోచర్లతో జనాలను మోసం చేశారంటూ చుట్టు పక్కన రైతులు చెబుతున్నారు. చెరువు ఎంట్రెన్స్​ లో గేటు పెట్టి చెరువుకు తాళం వేసినట్లుగా శిఖం భూమిలో ప్లాట్లు చేసి అమాయకులకు గాలం వేశారు.

తీరా వర్షా కాలం వచ్చాక ప్లాట్లుగా చేసి విక్రయించిన స్థలాలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయి. తమ ప్లాటు ( కొనుగోలు చేసిన స్థలం ) ఎక్కడుందో బోటు (పడవ)లో వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని అమాయకులు ఆందోళన చెందుతున్నారు. అది చెరువని, శిఖం భూమి అని తెలిసి అధికారులు ఎలా లే అవుట్లకు అనుమతులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అమ్ముడు పోయి అనుమతులు ఇవ్వడం వల్లే తాము నష్ట పోయామని బాధితులు తప్పుపడుతున్నారు. రియర్టర్ల నుంచి చెరువు శిఖం భూమిని కాపాడాలని రైతులు కోరుతున్నారు.

చెరువును కాపాడండి : మెత్తటి కృష్ణయ్య, రూప్​ ఖాన్​ పేట్​, రైతు





పోసాని చెరువులో క్రమేపి నీటి నిలువ శాతం తగ్గుతూ వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం రియర్టర్లు ముందుగానే కాలువలను దారి మళ్లించడం. మా పొలాలకు రెండు పంటలకు నీరు అందించే చెరువులు కాస్తా ప్లాట్లుగా మారి పోతున్నాయి. రియల్టర్ల నుంచి చెరువులు కాపాడి రైతుల పంటలకు నీరు అందేలా చూడాలి. చెరువులు ఇలా కబ్జా చేస్తూ పోతుంటే పంటలకు నీరు నిలువ చేసుకునే అవకాశం లేకుండా పోతుంది.

అధికారులు మేల్కొనాలి : ఎం.వెంకటయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు





పరిగి మున్సిపల్​ లోని కొత్త చెరువు, లొద్ది పడక వాగు మండల పరిధిలోని పోసాని చెరువు ఇలా చాలా చెరువుల శిఖం భూములు కబ్జా చేస్తూ, నాలాలను ఇష్టారీతిగా దారి మళ్లిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. నాలాలు దారి మళ్లించడం వల్ల నీరంతా ఇళ్ల మధ్యలోకి వస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. ఎఫ్​​ టీఎల్​ లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దు. ఇచ్చిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరో అధికారికి భయం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed