ప్లీజ్.. త్వరగా కానివ్వండి..! కాంగ్రెస్ లీడర్లపై డజన్ గులాబీ ఎమ్మెల్యేల ఒత్తిడి

by karthikeya |
ప్లీజ్.. త్వరగా కానివ్వండి..! కాంగ్రెస్ లీడర్లపై డజన్ గులాబీ ఎమ్మెల్యేల ఒత్తిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు డజన్ మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. కొందరు ఏఐసీసీ నేతల ద్వారా, ఇంకొందరు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొన్నటివరకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండానే చేరేందుకు సిద్ధమైనట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, మరో డజన్ మంది జంప్ చేసేందుకు రెడీగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.

బీఆర్ఎస్‌లో ఉండలేమంటోన్న ఎమ్మెల్యేలు

ఓ వైపు పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై విచారించాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా, మరోవైపు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు లీడర్ల ద్వారా సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా ఢిల్లీకి చెందిన కీలక లీడర్లను ఆశ్రయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు ‘బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ లేదు’ అని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని సైతం కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. జంపింగ్‌కు సిద్దమైన కొందరు ఎమ్మెల్యేలు చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, కొందరు మాత్రం అసలు అటు మోహం కూడా చూడటం లేదని తెలిసింది. ఈ మధ్య అరెకపుడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల పర్వం చివరికి వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కౌశిక్‌కు సపోర్టుగా నిలవాలని ఎమ్మెల్యేలకు పార్టీ అదేశించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మెజార్టీ మంది గులాబీ ఎమ్మెల్యేలు కౌశిక్ ఇంటికి వెళ్లలేదు. దీనితో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు అటు మోహం కూడా చూడలేదని ప్రచారం జోరుగా సాగుతున్నది.

బేషరతుగా జాయిన్.. ఇచ్చిందే తీసుకుంటాం

మొన్నటివరకు పార్టీలోకి వస్తే ఏం ఇస్తారు? అని ప్రశ్నించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి షరతులు పెట్టడం లేదని తెలుస్తున్నది. ‘పార్టీలో చేర్చుకుంటే చాలు. పదవి ఇచ్చినా, ఇవ్వకున్న సరే’ అని వేడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భవిష్యత్‌లో రాజకీయంగా నిలబడాలంటే, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సొంత పనుల కోసం రూలింగ్ పార్టీ సపోర్టు అవసరమని మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే పార్టీలోకి వచ్చే మాజీ మంత్రులపై ప్రస్తుత ప్రభుత్వంలో విచారణలు కొనసాగుతున్నాయి. వాటి ప్రభావాన్ని తగ్గించాలని సదరు మాజీ మంత్రులు కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. ఇంకొందరు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని, ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన సీటు రిజర్వ్ అయితే మరోచోట అడ్జస్ట్ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది.

చేరికలపై రేవంత్‌దే తుది నిర్ణయం

పార్టీలో చేరుతామని ఏఐసీసీ వద్ద లాబీయింగ్ చేస్తోన్న గులాబీ ఎమ్మెల్యేల చిట్టా సీఎం రేవంత్ వద్ద ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఎప్పుడు చేర్చుకోవాలి? ఒకేసారి చేర్చుకోవాలా? దశల వారీగా చేర్చుకోవాలా?అనే అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయానికి వదిలేసినట్టు తెలుస్తున్నది. సమయం, సందర్భం చూసుకుని ఎమ్మెల్యేల చేరికలకు ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ దఫా చేరికలతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఉంటుందని, అందుకోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య సైతం రెడీగా ఉందని రేవంత్‌కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed