ప్రభుత్వ భూమిలో నిర్మాణాల కూల్చివేత..రెవెన్యూ అధికారుల పక్షపాతం

by Aamani |
ప్రభుత్వ భూమిలో నిర్మాణాల కూల్చివేత..రెవెన్యూ అధికారుల పక్షపాతం
X

దిశ, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవ్ పల్లి టీఎన్జీవోస్ కాలనీలో సర్వేనెంబర్ 156 లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు రావడంతో బుధవారం పోలీస్ బందోబస్తు తో కూల్చడానికి వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని కులుస్తుండగా స్థానికులు ప్లాట్ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు బందోబస్తుతో వారిని అదుపులోకి తీసుకొని నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా బాధితులు జేసీబీ పై రాళ్ల దాడి చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రూ. 60 లక్షలు డబ్బులు పెట్టి ప్లాట్ కొన్నామని ఇప్పుడు కూలిస్తే ఎలా అంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. రెవెన్యూ అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ భూమిలో ఇక్కడ పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్న కావాలని ఒకటి కూల్చి మిగిలినవన్నీ వదిలేయడం లో ఆంతర్యం ఏమిటి అని స్థానికులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఫ్లాట్ యజమాని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లా నుంచి బాబుల్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నామని తమకు ఒక ప్లాటు కావాలని వెతకగా కొందరు వ్యక్తులు టీఎన్జీవోస్ కాలనీలో ప్లాట్ ఉందని చెప్పడంతో గ్రామంలో ఉన్న రెండు ఎకరాల పట్టా భూమిని అమ్ముకొని రూ. 60 లక్షలు పెట్టి 354 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన భాను ప్రకాష్ వద్ద 2023 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కొని రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామన్నారు. ప్రభుత్వ భూమి అయితే తమకు రిజిస్ట్రేషన్ ఎలా చేశారన్నారు.

దీంతో కొన్న ఫ్లాట్ లో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తుంటే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని కూల్చడం ఏమిటి అన్నారు. ఇక్కడ ఉన్న భూమి ఎంత ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు కానీ మన పక్కనే అనేకమైన నిర్మాణాలు ఉన్నాయని వాటి జోలికి పోకుండా కేవలం మమ్మల్ని కూల్చడంలో ఆంతర్యం ఏమిటి అన్నారు. మాకు ప్లాట్ అమ్మిన వారికి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు మీరు ఏమైనా చేసుకోండి అంటున్నారని, ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వారు ఎవరు అని వాపోయారు.

రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవ్ పల్లి గ్రామంలో 156 సర్వేనెంబర్ దాదాపు 433 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో టీఎన్జీవోస్ కు మిగతా వేరే సంస్థలకు భూమిని కేటాయించడం జరిగిందని మిగిలిన భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో కూల్చి వేయడం జరిగిందన్నారు. కూల్చడానికి వెళ్లిన జేసిబీపై రాళ్ల దాడి కూడా చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన చర్యలు తప్పవన్నారు. వాళ్లకు రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలు చూపిస్తున్నారని దానిపై కూడా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed