- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రియల్టర్ కోసం కాలువనే మళ్లించారు...
దిశ, తాండూరు : ఓ రియల్ ఎస్టేట్ యజమాని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఓ రియల్ దందా కోసం ఏకంగా కాలువను దారి మళ్లించారు. రియల్టర్ల కోసం కాల్వల మళ్లీంపు, మత్తడి ధ్వంసం ఇలా కబ్జాదారులు ఏం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. రియల్టర్లు చేసే కబ్జాలను రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువను అక్రమార్కులు కబ్జా చేస్తుంటే.. అధికారులు రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాలువ మళ్లించడం విమర్శలకు దారితీస్తోంది.
వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ అనురాగ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుమీద భారీ ఎత్తున వెంచర్ చేశారు. అయితే వెంచర్ కోసం ఆదిమడుగు నాలాలు కనుమరుగు చేసే ప్రమాదం ఉందని, ప్రకృతితో ఆటలు ఆడుతూ ఉత్తరాఖండ్ లాగా ప్రాణం మీదకు కొని తెచ్చుకోవడమే అంటున్నారు స్థానికులు. భారీగా వర్షాలు కురిస్తే వరద నీరు ఉధృతంతో ప్రజల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వస్తుందంటూ స్థానిక ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా కాలువ నిర్మాణం చేస్తున్న వారిని అడ్డుకొని..సంబంధిత అధికారులు భవిష్యత్తులో వరద ప్రమాదం రాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భవిష్యత్తులో ప్రమాదం
జుంటుపల్లి, అక్కంపల్లి, పగిడిపల్లి, చెన్నారం, లక్ష్మీ నారాయణ పూర్, మాల్ రెడ్డి పల్లి, అదిమడుగు, వద్దండరావు చెరువు నుంచి ఏళ్లుగా వర్షపు వరద నీరు ఈ కాలువ ద్వారా వస్తుంది. అలాంటి కాలువనే రియల్టర్ ఏకంగా పూడ్చేశాడు. తన పొలంలో వెంచర్ వేసుకునేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో ఈ కార్యానికి ఒడిగట్టాడు. ఏకంగా తన పొలం వెలుపలకు కాలువను మళ్లించాడు.
వెంచర్ యజమాన్యం దౌర్జన్యంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చక్కగా కాటన్ మిల్లు వెనుకభాగంలో ఉన్న కాలువను మలుపు, మలుపులు తీసి కాటన్ మిల్లు ప్రహరీ గోడ నుంచి బషీరాబాద్, తాండూరు ప్రధాన రహదారి అంచున తీయుంచాడు. ఇలా ఎవరు పడితే వారు.. ఇష్టారాజ్యంగా కాలువను మళ్లించుకుంటూ పోతే భవిష్యతలో ప్రమాదం తప్పవని రైతులు చెపుతున్నారు.
రియల్టర్కు అధికార పార్టీ నాయకుల అండదండలు
తాండూరులో కొత్తగా ఎక్కడైనా వెంచర్ చేయాలంటే నాలా మార్పిడితో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండాల్సిందే. రియల్టర్లు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా (నాలా) మార్పిడి చేసుకున్న వెంటనే స్థానిక నాయకులను సంప్రదిస్తున్నారు. వారు ఎలాంటి పంట కాల్వలనైనా సులువుగా వెంచర్లో కలిపేందుకు సలహాలు ఇచ్చి దగ్గరుండి ఆ పనిని పూర్తి చేయిస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించిన స్ధానికులను, రైతులను బెదిరింపుల కు గురి చేస్తుంటారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కాలువను మాయం చేయడానికి సదరు రియల్టర్లు నాయకులు, అధికారులకు భారీ ఎత్తున మామూళ్లు సమర్పించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియంత్రించాల్సిన సమయంలో మౌనం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది సంబంధిత అధికారుల పరిస్థితి. దాంతో వందల సంవత్సరాల చరిత్ర నాలాలు కనుమరుగవుతున్నాయి. నాలాలపై యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్నా వాటిని నియంత్రించలేదు. పాలకులు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అందినకాడికి దండుకొని అనుమతులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో నాలాలు పూర్తిగా కుచించుకుపోయి వర్షాకాలం వరద నీరు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు.