30 ఎకరాలు మాయం.. కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు

by Prasanna |   ( Updated:2024-09-24 03:29:30.0  )
30 ఎకరాలు మాయం.. కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడికి వెళ్లాలన్నా శంషాబాద్ రావాల్సిందే. దీన్ని ఆసరాగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ, సినీ ప్రముఖులు సైతం శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా రాజకీయ నాయకుల అండదండలతో చెరువులు, కుంటలు, వరద కాలువలను సైతం వదలకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పక్కనే 90 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన కాముని చెరువు ఉంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి వెంచర్లకు, గెస్ట్ హౌస్‌లు, ఫామ్ హౌస్‌లకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధనలున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీతో పాటు శంషాబాద్ మండలం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంది. అయితే, ఈ 111 జీవో పేదలకు మాత్రమే.. పెద్దలకు వర్తించదు అనే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు కొందరు అధికారుల అండదండలతో బరితెగించారు. ఏకంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కాముని చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయించారు. దీంతో ఎంతోమంది నిరుపేదలు ప్లాట్లు కొని ఇల్లు కట్టుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున యథేచ్ఛగా అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఎఫ్టీఎల్, బపర్ జోన్ హద్దు రాళ్లను సైతం తొలగించి నిర్మాణాలు చేస్తున్నారంటే వారికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల అండ దండలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

30 ఎకరాలు అన్యాక్రాంతం..?

90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాముని చెరువు ఇప్పుడు 60 ఎకరాలకే పరిమితమైంది. అంటే దాదాపు 30 ఎకరాలు అన్యాక్రాంతమైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 111 జీవో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లాంటి నియమ నిబంధనలు తమకు ఏమాత్రం వర్తించవని ఏకంగా కాముని చెరువు పూర్తిగా నిండి అలుగు పారే వరదకాలువ పైనే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖులు భారీ ఎత్తున హోటళ్లు నిర్మించారు. ఒక గెస్ట్ హౌస్, విద్యుత్ సబ్ స్టేషన్ మునిగిపోతాయంటే ఏ విధంగా బరితెగించి నిర్మాణాలు చేశారో? వాటికి మున్సిపల్ అధికారులు సైతం ఇంటి నంబర్ ఇచ్చారంటే వారికి ప్రభుత్వ అండదండలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు స్పందించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలను కూల్చివేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు సహకరించిన అధికారులపైన సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైడ్రా వచ్చేనా?

ఇటీవలే ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, నాలాలు, వరద కాలువలను రక్షించడానికి హైడ్రా కమిటీని ఏర్పాటు చేశారు. కబ్జా చేసి అక్రమ నిర్మాణాలుచేసిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే, హైడ్రా కమిటీ కాముని చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. అందులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

కాముని చెరువు దాటాల్సిందే..

హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఎంతోమంది ప్రముఖులు శంషాబాద్ విమానాశ్రయం వెళ్లాలంటే కాముని చెరువు దాటే వెళ్లాల్సి ఉంటుంది. ఎంత మంది ప్రముఖులకు కాముని చెరువు అలుగుపై నిర్మించిన హోటళ్లు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story