'కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా టీచర్లు.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలి'

by Vinod kumar |
కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా టీచర్లు.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నిలిచారని, దీనికి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎన్నికలే నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై టీచర్లకు ఆయన ధన్యవాదలు తెలిపారు. కేసీఆర్ సర్కార్ కు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ దెబ్బతో తమ ఉనికిని చాటుకునేందుకు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారన్నారు.

తెలంగాణ సమాజం కేసీఆర్ సర్కారును కూల్చడానికి సిద్ధంగా ఉందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ లో పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని పోరాటం చేస్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ ఏర్పడ్డాక కనీసం పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్ ది అని విరుచుకుపడ్డారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య, ఎంసెట్ పేపర్ లీకేజీ, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అన్నింటి వెనుకా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కనీసం పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని, అందుకే కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story