బిగ్ అలర్ట్: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

by Satheesh |   ( Updated:2023-05-06 14:37:24.0  )
బిగ్ అలర్ట్: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశముందని కేంద్రం పేర్కొంది. ఈ నెల7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, 9వ తేదీ రాష్ట్రంలో పొడి వాతావరణం వాతావరణ అధికారులు తెలిపారు.

రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్‌ ముప్పు

రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని, ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు ‘మోచా’ తుఫాన్‌ ఏర్పడే అవకాశమున్నదని అంచనా వేసింది.

నగరంలో మొదలైన వర్షం

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, దుండిగల్‌, మల్లంపేట, గండిమైసమమ, సూరారం, గాగిల్లాపూర్‌, కొండాపూర్‌లో వర్షం పడుతున్నది. శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, మదీనగూడ, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌లోనూ వర్షం కురుస్తున్నది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో వైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. మధ్యాహ్నం మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Also Read:

హైదరాబాద్ జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లు

Advertisement

Next Story