ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా ప్రొ.ఘంటా చక్రపాణి?

by samatah |
ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా ప్రొ.ఘంటా చక్రపాణి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులు కానున్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నది. ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఐదుగురు కమిషనర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 4 వరకు గడువు ఇచ్చింది. దాదాపు 200కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సచివాలయ వర్గాల సమాచారం. దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి అందేలా నోటిఫికేషన్‌లో సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. మొత్తం ఆరు పోస్టుల భర్తీ కోసం వచ్చిన దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్‌గా ఫుల్ టర్మ్ పనిచేసిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా సక్సెస్‌ఫుల్‌గా పరీక్షలను నిర్వహించారని అభ్యర్థులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం మరోసారి గడువు పొడిగించే అవకాశం లేకపోవడంతో ఆయన తిరిగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్లిపోయారు. ఈసారి ప్రభుత్వం ఆయనను చీఫ్ ఇన్ఫర్మేషన్(స్టేట్) కమిషనర్‌గా నియమించాలనుకుంటున్నది. దరఖాస్తుల స్క్రూటినీ ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రకటనలో ఆయన పేరు ఉండొచ్చంటూ ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.

మరో ఇద్దరు జర్నలిస్టులకు చాన్స్

ఆయనతో పాటు మరో ఐదుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అదే ప్రకటనలో వివరాలను తెలియజేయనున్నది. ఈ ఐదు పోస్టుల్లో రెండు జర్నలిస్టులకు, ఒకటి న్యాయవాదికి లభించనున్నట్లు సమాచారం. మిగిలిన రెండు పోస్టులపై స్పష్టత రాలేదు. వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన ఇద్దరు ఈ ఐదుగురిలో ఉండే అవకాశమున్నది. ఈ పోస్టు కోసం పలువురు జర్నలిస్టులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వివిధ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న ఉద్యమకారులు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed