వైఎస్సార్టీపీలోకి పొంగులేటి ముహుర్తం ఫిక్స్.. సర్వత్రా ఉత్కంఠ రేపుతోన్న మాజీ MP నిర్ణయం?

by Satheesh |   ( Updated:2023-02-04 10:25:53.0  )
వైఎస్సార్టీపీలోకి పొంగులేటి ముహుర్తం ఫిక్స్.. సర్వత్రా ఉత్కంఠ రేపుతోన్న మాజీ MP నిర్ణయం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశం హాట్ టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్‌లో అవమానం జరుగుతోందంటూ ఆరోపణలు చేస్తున్న ఆయన త్వరలోనే గులాబీ పార్టీ వీడి మరో పార్టీలో చేరుతారనే ఊహాగానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పొంగులేటి తన అనుచరులకు స్పష్టత ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

అయితే కారు దిగేందుకు సిద్ధం అయిన శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. ఆయన రాక కోసం ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ద్వారాలు తెరుచుకుని ఉంచాయనే టాక్ వినిపిస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆయన వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు కలిగిన శ్రీనివాస్ రెడ్డి షర్మిల పార్టీలో చేరబోతున్నారనే టాక్ సర్వత్రా ఆశ్చర్య పరుస్తోంది. ఇదిలా ఉంటే పొంగులేటి విషయంలో మరో ఆసక్తికర విషయం తెరపైకి వస్తోంది.

ఇటీవల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పొంగులేటి భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ చర్చ జరుగుతుండగానే పొంగులేటి భేటీ నిజమే అని.. ఆయన త్వరలో తమ పార్టీలో చేరుతానని తనకు మాటిచ్చారని షర్మిల ఇటీవల చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అయితే షర్మిలతో తాను భేటీ కాలేదని పొంగులేటి చెప్పడం ఈ ఇష్యులో అనూహ్య పరిణామంగా మారింది. గత జూలైలో షర్మిలను కలిసిన మాట వాస్తవమేనన్న పొంగులేటి అయితే తన కూతురు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికే వెళ్లాలని అంతే తప్ప తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

పొంగులేటి మాటలు ఇలా ఉంటే.. షర్మిల మాత్రం వైఎస్సార్ టీపీలో చేరుతారని తనకు మాట ఇచ్చారని షర్మిల చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇంతలోనే సోషల్ మీడియాలో పొంగులేటి వైఎస్ విజయమ్మతో భేటీ అయిన ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. వైఎస్సార్ టీపీలో చేరే విషయంలో విజయమ్మతో పొంగులేటి మంతనాలు జరుపుతున్నారని ఈ నెల 8న పాలేరులో షర్మిల పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి ఖమ్మంలో శ్రీనివాస్ తన పట్టును నిలుపుకోవడం రాజకీయంగా అతి ముఖ్యమైన అంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి తనపై జరుగుతున్న ఎటాక్ నేపథ్యంలో పొంగులేటి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. షర్మిల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో వైఎస్సార్సీపీ నుంచే పొంగులేటి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్‌ను వైస్సార్ టీపీ ద్వారా నిర్మించుకోబోతున్నారా లేదా అనేదానిపై కాలమే సమాధానం చెప్పనుంది.

Advertisement

Next Story

Most Viewed