తెలంగాణ రైతులను కాంగ్రెస్ మోసం చేసింది: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Mahesh Kanagandla |
తెలంగాణ రైతులను కాంగ్రెస్ మోసం చేసింది: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీని పూర్తి చేయలేదని ఆరోపించారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ఇప్పటికీ తెలంగాణలో రైతులు అక్కడి సర్కారును నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని కామెంట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, రైతులకు పక్షపాతి ఎన్డీయే ప్రభుత్వమేనని చెప్పారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాదీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నో పనులను నిలిపేసిందని, కేంద్రం నుంచి రైతుల కోసం ఎన్నో నిధులు విడుదల చేస్తే వాటిని దారిమళ్లించి జేబులో వేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత షిండే సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు ప్రయోజనాలు చేకూర్చే పనులు పరుగులు పెట్టాయని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు డెడ్‌లైన్ లోపే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. మూడు విడతలుగా రుణమాఫీ చేసింది. ఇందుకోసం సుమారు రూ. 18 వేల కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా రైతులందరికీ రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలుచోట్ల రైతులు కూడా రోడ్డెక్కి తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండగా.. కొందరికి జరగలేదని వాదనను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. ఇలా మాఫీ జరగని అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

కర్ణాటకలోనూ అదే పరిస్థితి:

ఇప్పుడు మహారాష్ట్రలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధితోపాటు షిండే ప్రభుత్వం కూడా అదనంగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నదని ప్రధాని మోడీ వివరించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే అదనపు సహాయాన్ని రైతులకు అందించిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సహాయాన్ని నిలిపేసిందని తెలిపారు. ఇదే వరుసలో తెలంగాణలో రైతు రుణమాఫీని ప్రధాని మోడీ ప్రస్తావించారు. తెలంగాణలో రైతు రుణమాఫీ జరగలేదని, రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర ప్రభుత్వంపై వారు ప్రశ్నలు గుప్పిస్తున్నారని వివరించారు.

బ్రిటీష్ పాలకుల ఆలోచనలే..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీని ఒక కుటుంబం చెప్పు చేతల్లోకి తీసుకుందని, బ్రిటీష్ పాలకుల నుంచి అధికారాన్ని అందిపుచ్చుకున్న ఆ కుటుంబం ఆలోచనలు కూడా విదేశీ పాలకుల లాగే ఉంటాయని ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. పేదలు పేదలుగానే, బలహీనులు బలహీనులుగానే ఉంచాలని కాంగ్రెస్ కోరుకుంటుందని, దేశ పురోగతిని అడ్డుకునేవారే ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. భారతీయులను విభజించి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నదని, ఈ విషయాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనించాలని పేర్కొన్నారు.

రైతు పక్షపాతి ఎన్డీయేనే..

ఢిల్లీలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైందని, ఆ డ్రగ్స్ రాకెట్ వెనుక ఓ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని ప్రధాని పేర్కొన్నారు. డ్రగ్స్‌తో యువతను మత్తులోకి నెట్టి.. మాదక ద్రవ్యాల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో కాంగ్రెస్ ఎన్నికల పోరాడాలని అనుకుంటున్నదని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం దేశ ప్రజల పురోగతి కోసమే పని చేస్తుందని, వికసిత్ భారత్ వైపుగా నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ఇందులో ముఖ్యంగా రైతులను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రధానంగా ఉంటుందన్నారు. తాము సాగు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని, మౌలిక వసతులు సహా ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టామని పేర్కొన్నారు. మహాయుతిని గెలిపిస్తే మహారాష్ట్ర రైతులకు రెట్టింపు లాభం కలుగుతుందని వివరించారు.

Advertisement

Next Story