Palamuru లో PM Modi ప్రకంపనలు.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం!

by GSrikanth |   ( Updated:2023-01-08 04:10:12.0  )
Palamuru లో PM Modi ప్రకంపనలు.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం!
X

పాలమూరు జిల్లాలో రాజకీయ వర్గాలు మొదలు సామాన్యుల వరకు ఎవరి నోటా విన్నా ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాపిక్. ఇటీవల దిశ దినపత్రికలో ప్రధాని మోడీ వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుంచి బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కథనం ప్రచురితమైంది. దీంతో ఈ టాపిక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు స`ష్టించింది. జిల్లాలో ఏ నోటా విన్నా అదే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్‌కు అండగా నిలిచింది ఉమ్మడి జిల్లా. ప్రధాని పోటీ చేస్తే తప్పకుండా రాజకీయంగా అనుహ్యమైన మార్పులు చేర్పులు ఉంటాయని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కొంత పట్టు ఉంది. కాగా, పాలమూరు లోక్ సభ నియోజకవర్గ బరిలో మోడీ నిలుస్తారన్న ప్రచారం ఆ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లోనూ ఈ అంశంపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. ఆ పార్టీ నేతలు సైతం భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ దిశ ప్రచురించిన కథనంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఏ నోటా విన్నా అదే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు టీడీపీ.. తర్వాత కాంగ్రెస్... ఇప్పుడు బీఆర్ఎస్‌కు అండగా నిలిచిన ఉమ్మడి పాలమూరు జిల్లా... ప్రధాని పోటీ చేస్తే తప్పకుండా రాజకీయంలో అనుహ్యమైన మార్పులు చేర్పులు ఉంటాయని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారే కాకుండా.. సాధారణ జనం సైతం అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు పాలమూరు గోస తీరాలంటే తెలంగాణ రావాలి అని ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకొని ఏకంగా 14 స్థానాల్లో 13 స్థానాలను దక్కించుకుంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో అధికార పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా రూపొందింది. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సాధించకపోవడం, వలసలు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గకపోవడం, స్థానిక నాయకత్వంపై పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం బీఆర్ఎస్‌కే దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాలమూరు నియోజకవర్గం నుంచి స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగే యత్నాలు జరుగుతున్నాయని 'దిశ' పత్రిక ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం కలిగించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటిదాకా మహబూబ్ నగర్, కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో కొంత పట్టు ఉన్న బీజేపీ పాలమూరు లోక్ సభ నియోజకవర్గ బరిలో ప్రధానమంత్రి మోడీ నిలుస్తారు అన్న ప్రచారం సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయన నియోజకవర్గాల్లో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలలోనూ మోడీ పాలమూరు నుంచి పోటీ చేసే అంశంపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి.

భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం: జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు నుంచి పోటీ చేస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి తెలంగాణ సాధించానని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి అన్యాయం చేశాడు. ప్రధానమంత్రి పోటీలో ఉంటే దగ్గర ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.

రాజకీయంగా పెను మార్పులు: డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

అధికార పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారు. ఈ సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగాను రాజకీయంగా పెను మార్పులు సంభవించడం ఖాయం.

ఇవి కూడా చదవండి : తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబంది

Advertisement

Next Story

Most Viewed