హైడ్రాను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-13 17:02:49.0  )
హైడ్రాను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, జలాశయాలు, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ)పై హైకోర్టు(High Court)లో పిటిష‌న్ దాఖ‌లైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ 19 జులై 2024న తీసుకొచ్చిన జీవో 99 చ‌ట్టబ‌ద్దత‌ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ కాద‌ని హైడ్రా(Hydra)కు ఎలా అధికారాలు ఇస్తార‌ని అడిగారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను మరొక అథారిటీకి ఇవ్వకూడదని లక్ష్మీ అనే మహిళ పిటిషన్ దాఖలు చేసింది.

హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆమె అన్నారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని, కానీ ప్రస్తుతం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాని వ్యక్తిని నియమించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నది. హైడ్రా చ‌ట్టబ‌ద్దత‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. ఈ పిటిష‌న్‌ను జ‌స్టిస్ కే.ల‌క్ష్మణ్ శుక్రవారం విచార‌ణ చేప‌ట్టారు. హైడ్రాపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story