‘సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి’

by Sathputhe Rajesh |   ( Updated:2024-08-02 08:33:35.0  )
‘సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీలలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర సచివాలయం ముందు తాజా మాజీ సర్పంచుల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భంలో సర్పంచులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండించింది. గత ప్రభుత్వం ఒత్తిడి మేరకు సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంఘం అధ్యక్షులు తెలిపారు.

గత ప్రభుత్వం అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. గాంధేయ మార్గంలో సచివాలయం ముందు చేయతలపెట్టిన నిరసన దీక్షకు పోలీసులు అడుగడుగున అడ్డుతగిలి అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి, జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వివిధ జిల్లాల, మండలాల సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Next Story