నిర్వాసితులకు పరిహారంపై నో క్లారిటీ.. సీతారామ ఇదేమి గోస‌!

by Rajesh |   ( Updated:2023-03-21 06:38:05.0  )
నిర్వాసితులకు పరిహారంపై నో క్లారిటీ.. సీతారామ ఇదేమి గోస‌!
X

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​జిల్లాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ప్రతిష్టాత్మకంగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం భూ సేకరణ చేపట్టింది. కానీ ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు 20శాతం భూ నిర్వాసితులకు కూడా పరిహారం అందకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టులో భాగంగా మానుకోట జిల్లా డోర్నకల్ మండలంలో దాదాపు 600 ఎకరాలను సేకరించింది. సుమారు 600మంది రైతులు భూములు కోల్పోగా భూ నిర్వాసితుల్లో కేవలం 100మందికి మాత్రమే పరిహారం అందింది.

నేటికీ మరో 500మంది రైతులకు పైసా పరిహారం అందలేదు. ఒక వైపు భూములు కోల్పోయి పంటలు సాగుచేసే అవకాశం లేక, మరోవైపు ప్రభుత్వం పరిహారం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది రైతులు బతుకుదెరువు కోసం కూలీలుగా మారారు. డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు అత్యవసర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వందకు 2శాతం చొప్పున పర్సంటేజీ ఇచ్చిన కొంత‌మందికి ప‌రిహారం డ‌బ్బులు అందిన‌ట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పరిహారం డబ్బులు అందజేసి ఆదుకోవాలని భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు.

–దిశ, డోర్నకల్

దిశ, డోర్నకల్ : భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ‌త‌ల‌పెట్టిన సీతారామ బ్యారేజీ నిర్మాణం, ఎత్తిపోత‌ల ప‌థ‌కం న‌త్తన‌డ‌క‌న సాగుతోంది. భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల‌కు సాగునీటిని అందించే ల‌క్ష్యంతో ఎత్తిపోతల ప‌థ‌కాల‌ను ఆరంభించ‌గా, భూ నిర్వాసితుల్లో 20శాతం మందికి కూడా ప‌రిహారం ద‌క్కక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని డోర్నక‌ల్ మండ‌లంలో దాదాపు 600 మంది భూ నిర్వాసితుల్లో కేవ‌లం 100 మందికే ప‌రిహారం ద‌క్కింది. ఇంకా 500 మంది రైతులు త‌మ భూముల‌కు ప‌రిహారం ఎప్పుడు వ‌స్తుందా అంటూ వేచి చూస్తున్నారు.

ఇదీ డోర్నక‌ల్ రైతుల గోస‌..

సీతారామ ఎత్తిపోత‌ల సాగునీటి ప‌థ‌కానికి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల వ్యాప్తంగా దాదాపు 612 ఎకరాల భూమిని సేక‌రించారు. ప్రభుత్వం తక్కువ రేటుతో నష్టపరిహారం చెల్లిస్తుండడంతో తమ విలువైన భూములను ఇవ్వమంటూ ఆ సమ‌యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. ఏక‌గీవ్రంగా పంచాయ‌తీల్లో తీర్మానాలు చేసిన అధికారులు న‌యానో భ‌యానో, ప‌రిహారం ఆశ చూప‌డంతో దీర్ఘకాలిక ప్రయోజ‌నాలుంటాయ‌ని భావించి భూములిచ్చేందుకు రైతులు అంగీక‌రించారు. ఆ భూముల్లో ఎలాంటి సాగు పనులు చేయవద్దని ఆదేశించారు.

అసంతృప్తిగా ఒప్పుకున్న రైతులు వెంటనే పరిహార సొమ్ములు అందితే మరో చోట కొనుగోలు చేసుకోవ‌చ్చని భావించారు. కొందరు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత డబ్బు కట్టి పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రెండున్నరేళ్లుగా ప‌రిహారం అంద‌క‌పోవ‌డంతో రైతులు అరిగోస ప‌డుతున్నారు. ఉన్న భూముల్లో వ్యవ‌సాయం చేయ‌కుండా, ప్రత్యామ్నాయ మార్గం చూసుకోకుండా ప‌రిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని రైతులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

ప‌రిహారంలో ప‌ర్సంటేజీల ఆరోప‌ణ‌లు..

పెరిగిన భూ విలువకు అనుగుణంగా పరిహారం పెంచాలని ఓవైపు, పైరవీలకు తావులేకుండా వెంటనే పరిహారం విడుదల చేయాలని రైతులు పోరాటాలు చేస్తున్నారు. ఇరిగేషన్‌ నిబంధనల ప్రకారం కల్వర్టులు, ఆక్విడెక్టులు, అండర్‌టన్నెల్స్‌ ఇతరత్రా అత్యవసర పనులు నిర్వహించాల్సిన ప్రాంతాల్లోని రైతులకు తక్షణం పరిహారం చెల్లించి పనులు మొదలుపెట్టాలి. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్నిచోట్ల చెల్లింపులు జరుగుతుండడం నిర్వాసిత రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు అత్యవసర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వందకు 2శాతం చొప్పున పర్సంటేజీ ఇచ్చిన కొంత‌మంది రైతుల‌కు ప‌రిహారం డ‌బ్బులు అందిన‌ట్లుగా కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఒక లెక్కాపత్రం లేకుండా అరకిలోమీటర్‌ దూరంలో కొందరికి, కిలోమీటర్నర దూరంలో కొందరికి పరిహారం ఇచ్చినట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ప్రాణాలు పోతున్నా పరిహారం అందట్లే..

మా విలువైన భూములను తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకుంది. రెండేళ్లు అవుతున్నా పరిహారం ఊసే లేదు. అనేక పర్యాయాలు ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం లేదు. కొద్దిపాటి భూములను ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తీసుకుంది. రెండేళ్ల క్రితం అధికారులు నిర్ణయించిన ప్రకారం నష్టపరిహారం చెల్లించినట్లయితే ప్రత్యామ్నాయ మార్గం ఉండేది. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఊర్లు వదిలి పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు.

మండలంలో కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడి సాయం (రైతుబంధు) అందక, సాగుకు నోచుకోక ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డాం. రెండేళ్ల క్రితం భూమి ధర ప్రస్తుతం రెండింతలు పెరిగింది. ప్రస్తుత ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed