నగర పాలక సంస్థలో కార్పొరేటర్లు పార్టీ మార్పు ?

by Sumithra |
నగర పాలక సంస్థలో కార్పొరేటర్లు పార్టీ మార్పు ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర పాలక సంస్థలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కొందరు ఇటీవల కాలంలో పార్టీ మారడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి కార్పొరేటర్ల పార్టీ మార్పు ఎందుకు జరుగుతుందనే చర్చ మొదలయింది. కార్పొరేటర్ల పదవి కాలం ఏడాది ఉన్నప్పుడు వారు కేవలం అధికార పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు లోకల్ ఎమ్మెల్యే ఓటమితోనే తమ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నారన్న చర్చ జరుగుతుంది. నిజామాబాద్ బల్దియాలో మెజార్టీ నియోజకవర్గంగా ఉన్న నిజామాబాద్ అర్బన్ పై దాదాపు దశాబ్దం తర్వాత బీజేపీ జెండా ఎగురవేయడంతో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. ఇటీవల కాలంలో నిజామాబాద్ నగర మేయర్ పై బీజేపీ అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ లో ప్రధానంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటమి తర్వాత చాలా మంది కార్పొరేటర్ల పై దళితబంధు ఇప్పిస్తామని దళితుల వద్ద నుంచి లక్షల రూపాయలు అడ్వాన్సులుగా తీసుకున్న వ్యవహరం వెలుగులోకి వచ్చింది. అంతేగాకుండా నిజామాబాద్ నగరపాలక సంస్థలో ప్రస్తుత పాలకవర్గ హయంలో 340 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో కార్పొరేటర్లు కొందరు లంచాలు తీసుకుని నియామకాలు చేశారని అపవాదును మూటగట్టుకున్నారు. ప్రస్తుతానికి కార్పొరేటర్ల పై ప్రధానంగా పార్టీ మారిన వారు ఆయా డివిజన్ లలో ఉన్న వ్యతిరేకత త్వరలో జరిగే బల్ధియా నేతల్లో ప్రభావం చూపుతుందన్న కారణంతో ముందస్తుగా పార్టీ మారేందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

2019లో నిజామాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీ అండతో బీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కిన విషయం తెల్సిందే. ఎన్నికలు జరిగిన సమయంలో భారతీయ జనతా పార్టీ 28 మంది కార్పొరేటర్లతో అత్యధిక సభ్యులున్న పార్టీగా ఉన్నప్పటికీ మెజార్టీకి ఆరగడుల దూరంలో మేయర్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. మజ్లీస్ 16 స్థానాలు, బీఆర్ఎస్ 13 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, స్వతంత్రులు 1 గెలిచిన విషయం తెల్సిందే. తర్వాత కాలంలో 13 మంది బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఒక కాంగ్రెస్, మరొక స్వతంత్రుడు కూడా బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ లో బలమైన పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ గుప్త నగరంలో డెవలప్ మెంట్ విషయంలో తన మన అనే తేడా లేకుండా అందరి కార్పొరేటర్లతో కలుపుగోలుగా ఉండే విధంగా అందరినీ సమానంగా చూశారు.

ఈ నేపథ్యంలోనే అందరూ కార్పొరేటర్ల మాదిరిగానే బీజేపీ, మజ్లీస్ కార్పొరేటర్లకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. పనులకు సంబంధించి డివిజన్ లలో నిధుల కేటాయింపుతో పాటు దళిత బంధు లబ్ధిదారుల ఎంపికను కూడా లోకల్ కార్పొరేటర్లకు అందరికీ సమానంగానే కేటాయించారు. దానితో పాటు బల్దియాలో రెండేళ్ల క్రితం జరిగిన నియామకాల్లో ప్రతి కార్పొరేటర్ కొంత మంది ఉద్యోగులను నియమించుకునే విధంగా అవకాశం కల్పించారు. కానీ వారు దానిని దుర్వినియోగం చేసుకుంటూ లబ్దిదారుల ఎంపికలో లక్షల్లో కమిషన్ తీసుకోవడంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నియామకాలకు లక్షల్లో లంచాలు తీసుకున్నారనే వాదనలున్నాయి. దాంతో దళిత బంధు అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు దక్కాయని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమించిన వారిలో ఎలాంటి స్కిల్స్ లేకున్నా పారిశుద్ధ్య కార్మికులు మినహా మిగిలిన వారు ఉద్యోగులుగా చలామణి అవుతున్నారనే విమర్శలున్నాయి.

నిజామాబాద్ నగర పాలక సంస్థ పై బీజేపీ జెండాను ఎగురవేయాలని ఇటీవల అసెంబ్లీ ఫలితాల తర్వాత బీజేపీ యోచన చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఇతర పార్టీలో చేరిన వారిని రప్పించుకునేందుకు ఘర్ వాపస్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే అదునుగా కొందరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారు తిరిగి సొంత గూటికి చేరేందుకు క్యూ కట్టారు. దానికి తోడు మరికొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అర్బన్ లో చర్చ మొదలయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, ఎమ్మెల్యే ఓటమితో కార్పొరేటర్లుగా అందిన కాడికి దండుకున్న వారు ఎక్కడ తమపై అవినీతి, అక్రమ వసూళ్ల పై విచారణ జరుగుతుందోననే భయంతో ముందు జాగ్రత్త పడుతున్నారనే చర్చ జరుగుతుంది.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీలు స్థానిక సంస్థల పాలకవర్గాల పై అవిశ్వాస తీర్మాణాలకు ముందుకు రావడం ఒక కారణంగా చెప్పాలి. బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే ఆటోమెటిక్ గా ఆ పార్టీకి బలం కానుంది. అదే విధంగా ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడంతో వారిద్దరు నగర పాలక సంస్థలో ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా చేరుతారని ఇది వరకే సభ్యుడిగా ఉన్న ఎంపీ అరవింద్ అదనపు బలమని లెక్కలు కడుతున్నారు. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆత్మప్రబోదానుసారం ఓటేస్తే మాత్రం బీఆర్ఎస్ కు పదవి గండం పొంచి ఉందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు ఎక్కడ తాము ఇరుక్కోకుండా మధ్యే మార్గంగా దీపం ఉన్నప్పుడే ఇళ్ళు చక్కబెట్టుకున్నట్లు బీజేపీ బల్ధియా పై కన్నేస్తే సహకరిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed