తెలుగు రాష్ట్రాల సీఎంలు ఐకమత్యంతో పనిచేయాలి : "అలయ్ బలయ్"లో బండారు దత్తాత్రేయ

by M.Rajitha |
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఐకమత్యంతో పనిచేయాలి : అలయ్ బలయ్లో బండారు దత్తాత్రేయ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం ఐకమత్యంతో పనిచేయాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అలయ్ బలయ్ కి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ముఖ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. హర్యానాకు తాను గవర్నర్ అయినా తెలంగాణ బిడ్డనే అని పేర్కొన్నారు. అలయ్ బలయ్ లో పలు చేతి వృత్తులను ప్రదర్శించామని, వాటిని కాపాడుకోవాలని కోరారు. అలయ్ బలయ్ కి వస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. ఆయన ఆత్మవిశ్వాసంతో ఎదిగారని కొనియాడారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ అని దత్తాత్రేయకొనియాడారు.

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ..

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఎనర్జీ ఉండాలని, అలయ్ బలయ్ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని కొనియాడారు. ఐక్యతకు వేదికగా అలయ్ బలయ్ ఉందని, తెలంగాణ కల్చర్ ఎంతో అందంగా ఉందని గవర్నర్ కొనియాడారు. త్రిపురలో కూడా విజయదశమి వేడుకలు ఘనంగా చేస్తామని ఆయన తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చేర్పులు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో ఘర్షణ పడొచ్చని, తమ ఎజెండా ప్రజలకు చెప్పుకోవచ్చన్నారు. కానీ ఎన్నికల తర్వాత బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు ముఖ్యమనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దన్నారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..

దత్తాత్రేయ స్నేహశీలి అని, రాజకీయాలకతీతంగా అందరినీ ఆహ్వానించే మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పారని కొనియాడారు. అందరూ కలిసి బంధాలను అనుబంధాలను పెంచుకోవడానికి నిదర్శనంగా అలయ్ బలయ్ నిలిచిందన్నారు. ఐక్యంగా ఉండటమంటే ఎదుటివారి ఆలోచనలను గౌరవించడమేనని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు సనాతన ధర్మంలో తాను అనే పదానికి విలువలేదని, మనం అనే దానికి బలం ఉందన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ..

అలయ్ బలయ్ తెలంగాణ సాంప్రదాయానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో అందరి సక్యతకు వేదిక అని కొనియాడారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎవరికెన్ని విభేదాలు ఉన్నా.. దసరా రోజు అలయ్.. బలయ్ చేసుకుంటామన్నారు. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అలయ్ బలయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తుకువస్తారన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు మాట్లాడుతూ..

అలయ్ బలయ్ ఆంధ్రలో కూడా పెట్టాలన్నారు. రాయలసీమలో ఒకసారి యుద్ధం ప్రకటిస్తే.. అంతే సంగతులని, అందుకే అక్కడ కూడా అలయ్ బలయ్ పెట్టాలని సూచించారు. రాయలసీమలో కల్చర్ మారాలని, కొట్టుకోవడం పోవాలని వివరించారు. దతన్న పేరు.. అలయ్ బలయ్ దత్తన్నగా మార్చాలని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నాయకుల ప్రసంగాల్లో భాషలో మార్పులు రావాలన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్న విధానాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విమర్శించుకుందామని, కానీ ప్రజలు అసహ్యించుకునేలా మాత్రం మాట్లాడవద్దని, ఇది అన్ని రాజకీయ పార్టీలకు తన విజ్ఞప్తిగా పేర్కొన్నారు.

అలయ్ బలయ్ పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు

అలయ్ బలయ్ వేడుకపై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కేంద్రంలో ఉన్న బీజేపీ భాగస్వామిగా ఉందని, అందుకే తాను ఈ ప్రోగ్రామ్ కి రాలేను అని నారాయణ ప్రకటించారు. అయితే ఇదే కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హాజరయ్యారు. రాజకీయాలకతీతంగా అభిప్రాయాలు పంచుకుని, మానవత్వం చాటుకునే వేదిక అని కూనంనేని వ్యాఖ్యానించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story