Baba Siddique: ముంబయి నడిబొడ్డులో మాజీ మంత్రి హత్య.. అసలేం జరిగింది?

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-13 16:19:56.0  )
Baba Siddique: ముంబయి నడిబొడ్డులో మాజీ మంత్రి హత్య.. అసలేం జరిగింది?
X

దిశ, నేషనల్ బ్యూరో: వాణిజ్య రాజధాని, మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ముంబయి నడిబొడ్డులో బహిరంగంగా రోడ్డుపైనే మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(66) హత్య జరిగింది. ముగ్గురు దుండగులు ఆటోలో దిగి రోడ్డుపై అటకాయించి కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పుల్లో ఐదు బుల్లెట్లు తగిలిన సిద్ధిఖీ నెత్తుటి మడుగులో గింజుకున్నాడు. వెంటనే హాస్పిటల్ తరలించగా.. చికిత్స అందిస్తున్నా పరిస్థితి విషమించి సిద్ధిఖీ కన్నుమూశాడు. నిందితులు ప్రీప్లాన్‌గానే ఈ మర్డర్ చేసినట్టు తెలుస్తున్నది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మూడో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ హత్యను తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఓ సభ్యుడు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు..‌ దసరా పండుగ సందర్భంగా భారీ భద్రతను ప్రభుత్వం మోహరించిన రోజే బహిరంగంగా ఈ హత్య జరగడం రాజకీయ దుమారాన్ని రేపింది.

ఏం జరిగింది?

మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో సుదీర్ఘంగా పని చేసిన బాబా సిద్ధిఖీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అజిత్ పవార్ ఎన్సీపీలో చేరారు. కొడుకు జీషన్ సిద్ధిఖీ ముంబయి కాంగ్రెస్ ఎమ్మెల్యే. బాంద్రాలోని ఖేర్ నగర్‌లో ఎమ్మెల్యే జీషన్ ఆఫీసు బయటే శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు నిందితులు ఆటోలో స్పాట్‌కు వచ్చి బాబా సిద్ధిఖీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో అటు వచ్చిన బాబా సిద్ధిఖీని వారు అడ్డగించారు. గన్‌లు తీసి కాల్చారు. ఆరు రౌండ్లు కాల్పులు జరపగా.. రెండు బుల్లెట్లు ఛాతీలో నుంచి చొచ్చుకెళ్లినట్టు వైద్యులు తెలిపారు. విపరీతంగా రక్తం కోల్పోయిన బాబా సిద్ధిఖీని లీలావతి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అప్పటికే సిద్ధిఖీ బాబా‌ పల్స్ పడిపోయింది. గుండె కొట్టుకోవడం లేదు, బీపీ లేదు. వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఐసీయూలోనూ ఆయన ప్రాణాలు నిలపడానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. ఫలించకపోవడంతో శనివారం రాత్రి 11.27 గంటల ప్రాంతంలో బాబా సిద్ధిఖీ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

ప్రీ ప్లాన్ మర్డర్?

హర్యానాకు చెందిన గుర్మేల్ బల్జిత్ సింగ్(23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ (19)లను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఒకరికి మైనార్టీ నిండలేదని వాదనలు రాగా.. బోన్ ఒస్సాపికేషన్ నిర్వహించారు. ఇద్దరు నిందితులకు ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు కస్టడీ విధించింది.

ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని ముంబయి పోలీసు అధికారులు తెలిపారు. హంతకులకు ముందస్తుగానే రూ. 50 వేల చొప్పున డబ్బులు ముట్టాయి. ఆయుధాలను కూడా ఓ కొరియర్ అందించాడు. కుర్లాలో రూ. 14 వేల కిరాయితో‌ హంతకులు రెంట్‌కు దిగారు. సిద్ధిఖీ కదలికలను కొన్నాళ్లుగా పసిగడుతున్నారు. దసరా నాడు మర్డర్ చేయడానికి ప్లాన్ వేశారు. ముగ్గురూ జీషన్ ఎమ్మెల్యే ఆఫీసు ముందుకు ఆటోలో వచ్చారు. బాబా సిద్ధిఖీ అక్కడికి రాగానే అడ్డుకుని మాటల్లో కలిపారు. ఆయనపై కాల్పులకు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించారు. పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు.

బిష్ణోయ్ గ్యాంగ్ పనా?

ఈ హత్య జరిగిన తర్వాత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు ఒకరు సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయింది. బాబా సిద్ధిఖీ హత్యను తామే చేశామని పేర్కొన్నాడు. ఇది వాస్తవమని ధ్రువీకరించే పరిస్థితి లేదు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజకీయ, వ్యాపార ప్రత్యర్థుల పనా? స్లమ్ రిహాబిలిటేషన్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ జరిగిందా? అనేది దర్యాప్తు చేస్తామని వివరించారు. స్లమ్ రిహాబిలిటేషన్‌ను వ్యతిరేకిస్తూ 15 రోజుల క్రితమే బాబా సిద్ధిఖీకి బెదిరింపులు వచ్చాయి. దీంతో వై కేటగిరీ భద్రత కల్పించారు. కాల్పులు జరుగుతున్నప్పుడు ఓ కానిస్టేబుల్ వెంటే ఉన్నారు. ఇంతకీ హంతకులు ఎవరు? వారి లక్ష్యం ఏమిటీ? అనేది దర్యాప్తులో తేలనుంది.

బాబా సిద్ధిఖీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?

1999, 2004, 2009లలో ఎమ్మెల్యేగా గెలిచిన బాబా సిద్ధిఖీ ముంబయిలో ఫేమస్ లీడర్. రాజకీయాల్లో సక్సెస్‌గా కొనసాగిన బాబా సిద్ధిఖీకి బాలీవుడ్ స్టార్లతో సత్సంబంధాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ వంటి అగ్ర ఫిలిం స్టార్లతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు ఎక్కువ క్లోజ్. బాబా సిద్ధిఖీ పాలిటిక్స్‌లో రాణించడానికి సల్మాన్ కూడా సహకరించారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడానికి సల్మాన్ కృషి ఉన్నట్టు చెబుతారు. సల్మాన్, షారుఖ్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి కూడా బాబా సిద్ధిఖీ కృషి ఉన్నది. ప్రతి ఏడాది ఈయన గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు. ఈ పార్టీలకు రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు హాజరవుతారు. ముంబయిలో.. ముఖ్యంగా ముస్లింలో బాబా సిద్ధిఖీకి విశేష ఆదరణ ఉన్నది. కరోనా సమయంలో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ సప్లై చేసిన బాబా సిద్ధిఖీ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఇదిలా ఉండగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపు లేఖలు, మెయిల్స్ పంపింది. ఓ సారి ఆయన నివాసంపై ఐదు రౌండ్ల కాల్పులు కూడా జరిపింది. అప్పుడు వేరే చోట ఉండటంతో సల్మాన్‌కు గాయాలు కాలేదు. కృష్ణ జింక వేటకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ పై కక్ష పెంచుకున్నట్టు చెబుతారు.

ఎన్నికల వేళ రాజకీయ దుమారం

వచ్చే నెల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి హత్య జరగడం రాజకీయ దుమారానికి ఆజ్యం పోసింది. దసరా సందర్భంగా సీఎం షిండే, ప్రతిపక్ష నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగాల నేపథ్యంలో ముంబయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా.. అదే నాడు మాజీ మంత్రి హత్య జరిగింది. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలకు నిదర్శనమని ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేరస్తులపైకాకుండా తమపై నిఘా వేస్తున్నదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed