సర్కార్‌పై పోరుకు రెడీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిగ్ ప్లాన్

by srinivas |
సర్కార్‌పై పోరుకు రెడీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిగ్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీలతో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అలయ్ బలయ్ అనంతరం దిల్‌ ఖుషా గెస్ట్ హౌస్‌లో ఆదివారం వారు సమావేశమయ్యారు. తొలుత హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఇన్ చార్జీరగా వ్యవహరించిన జమ్మూ కశ్మీర్‌లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. ఈనేపథ్యంలో ఎంపీలు కిషన్ రెడ్డిని అభినందించారు. శాలువాతో సన్మానించారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ కొనసాగిందని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రస్తావించినట్లు సమాచారం. హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. హైడ్రా, మూసీపై ప్రభుత్వం త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పడంతో తాము ఏ అంశాలను లేవనెత్తాలనే వాటిపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఇతర ఎంపీల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధానంగా ఫోర్త్ సిటీ అంశాన్ని లేవనెత్తాలని బీజేపీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫార్మా డెవలప్ కోసం తీసుకున్న భూములను ఫోర్త్ సిటీ కోసం వినియోగించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనిపై ఉధృతంగా పోరాడాలని, ఫోర్త్ సిటీ కోసమే అయితే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయాలని బీజేపీ ఎంపీలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మీటింగులో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed