Madrasa : మదర్సాల మ్యాపింగ్‌కు ‘విపక్ష’ రాష్ట్రాల నో.. ఎన్‌‌సీపీసీఆర్‌కు షాక్

by Hajipasha |
Madrasa : మదర్సాల మ్యాపింగ్‌కు ‘విపక్ష’ రాష్ట్రాల నో.. ఎన్‌‌సీపీసీఆర్‌కు షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : మదర్సాలపై ఇటీవలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌‌సీపీసీఆర్) కీలక సిఫారసులు చేసింది. అన్ని మదర్సాలను మ్యాపింగ్ చేయడంతో పాటు వాటిలో చదువుతున్న విద్యార్థుల వివరాలను సేకరించాలని సూచించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి సానుకూల స్పందనే వచ్చినప్పటికీ.. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి ప్రతికూల సమాధానమే ఎన్‌‌సీపీసీఆర్‌కు అందింది. కొన్ని విపక్ష పాలిత రాష్ట్రాలైతే ఇప్పటికీ దీనిపై కనీస స్పందనను కూడా తెలియజేయలేదు. ‘గార్డియన్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఆప్రెసర్ ఆఫ్ రైట్స్ : కాన్‌స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ చిల్డ్రెన్ వర్సెస్ మదర్సాస్’ శీర్షికన ఒక ముసాయిదా నివేదిక ఇటీవలే ఎన్‌‌సీపీసీఆర్ విడుదల చేసింది. మదర్సాలకు సంబంధించి ఈ నివేదికలో ప్రస్తావించిన సిఫారసులను అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు లేఖ రాసింది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మదర్సాలు ఎన్ని ? ఎంత మంది ముస్లిమేతరులు మదర్సాలలో చదువుతున్నారు ? ఇప్పటిదాకా మ్యాపింగ్ చేయని మదర్సాలు ఎన్ని ? మదర్సాల నుంచి సాధారణ స్కూళ్లలోకి మార్చిన విద్యార్థుల సంఖ్య ఎంత ? అనే వివరాలను సేకరించి తమకు అందించాలని చీఫ్ సెక్రెటరీలను కోరింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 (2)ని ప్రస్తావిస్తూ ఈ లేఖకు తృణమూల్ కాంగ్రెస్ పాలిత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బదులిచ్చింది. ‘‘ఏదైనా విద్యాసంస్థలో చదువుకునే హక్కును దేశ ప్రజలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 (2) కల్పించింది. ఈవిషయంలో మత ప్రాతిపదికన వివక్షను చూపకూడదు’’ అని పేర్కొంటూ బెంగాల్ సర్కారు బదులిచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక కూడా ఎన్‌‌సీపీసీఆర్ సిఫారసులను బేఖాతరు చేసింది. ఎన్‌‌సీపీసీఆర్ నివేదికను తప్పుపడుతూ కేరళలో రాజకీయ పార్టీలు, ముస్లిం సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. తమ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాయోజిత మదర్సాలే లేవని కేరళ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈవిధంగా పలు రాష్ట్రాలు తమకు సహకరించకపోవడాన్ని ఎన్‌‌సీపీసీఆర్ తప్పుపడుతోంది. తాము అడిగిన సమాచారాన్ని సేకరించి అందించకపోవడం అనేది సంస్థాగతంగా ప్రాథమిక హక్కులను కాలరాయడం వంటిదని వాదిస్తోంది.

Advertisement

Next Story