టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ వార్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద ఉద్రిక్తత

by Sathputhe Rajesh |
టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ వార్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద ఉద్రిక్తత
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఆందోళన చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, నిర్మాణం చేసిన ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని గతంలో ధర్నా చేసి 40 రోజుల సమయం ఇచ్చినా ఇప్పటికి ఇవ్వలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్లను ఇస్తుందని టీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాల నాయకులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story