పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-06-06 11:17:33.0  )
పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

సీఎం కేసీఆర్ ప్రభుత్వ సరళీకృత విధానాలతో పరిశ్రమల వెల్లువ

దిశ, నిజామాబాద్ సిటీ : పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ అని, ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రధాన కార్యాలయాలకు వేదికగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంలా మారిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో, ఐటీ సెక్టార్ లో సాధించిన అద్వితీయ పురోగతి గురించి కళ్లకు కట్టినట్టు వివరించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తున్న తోడ్పాటు, సులభతరంగా అనుమతుల మంజూరు తదితర అంశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరించారు.

ప్రభుత్వ సరళీకృత విధానాలకు ఆకర్షితులై ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న వైనాన్ని తెలియజేశారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్, తైవాన్ కు చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీ ఫాక్స్ కాన్ సీఈవో, బొష్ కంపెనీ నిర్వాహకులు దత్తాద్రి, కేరళకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ తదితరులు చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్యలతో కూడిన వీడియోలు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు, మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ఆవిష్కరింపజేశాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పవర్ హాలిడేలతో అనేక పరిశ్రమలు మూతబడ్డాయని తెలిపారు. సమైక్య పాలన నాటి దైన్య స్థితిని మంత్రి వేముల గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన అనంతరం సీఎం కేసీఆర్ పరిశ్రమలు స్థాపించే వారికి అనుకూలంగా ఉండేలా టీఎస్-ఐపాస్ చట్టం తీసుకువచ్చి ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

జిల్లా స్థాయి కమిటీ ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమావేశమై ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మారే గంగారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సమ్మయ్య, వివిధ శాఖల అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed