Adani: లంచం ఆరోపణలతో అదానీ శ్రీలంక ప్రాజెక్ట్‌పై యుఎస్ ఏజెన్సీ సమీక్ష

by S Gopi |
Adani: లంచం ఆరోపణలతో అదానీ శ్రీలంక ప్రాజెక్ట్‌పై యుఎస్ ఏజెన్సీ సమీక్ష
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కొత్త కష్టాలను ఎదుర్కొంటోంది. శ్రీలంకలో ఓడరేవు అభివృద్ధికి 500 మిలియన్ డాలర్లు రుణమివ్వడానికి అంగీకరించిన అమెరికా ఏజెన్సీ తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. ఈ ప్రాజెక్టు అంశంపై మరింత సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ రుణానికి సంబంధించి తుది ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని ఓ అధికారి ఈ-మెయిల్‌ ద్వారా బదులిచ్చింది. 'ఏదైనా ప్రాజెక్ట్ కోసం రుణం ఇచ్చే ముందు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని అంశాలు సంస్థ కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మేము తగిన శ్రద్ధను తీసుకుంటామని' అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆర్థికపరమైన వ్యవహారం తుది దశకు చేరుకోవడం గానీ, రుణ ఒప్పందంపై సంతకాలు కూడా చేయలేదని స్పష్టం చేశారు. అయితే, లంచం ఆరోపణలు శ్రీలంక ప్రాజెక్ట్‌లో ప్రమేయం ఉన్న అదానీ అనుబంధ సంస్థను ప్రభావితం చేయదని అధికారి అభిప్రాయపడ్డారు. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడుతున్న శ్రీలంక రాజధానిలో పోర్ట్ టెర్మినల్‌కు ఆర్థిక సహాయం చేస్తామని అమెరికా ఏజెన్సీ గతేడాది ప్రకటించింది. ఇది ఆసియాలో ఏజెన్సీ యొక్క అతిపెద్ద మౌలిక సదుపాయాల పెట్టుబడి కావడం గమనార్హం. దీని ద్వారా అమెరికా ఉనికి విస్తరించేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఆసియా ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ఎదురుకొనేందుకు సహాపడవచ్చనే అంచనాలున్నాయి.

Advertisement

Next Story