SRSP : ఎస్సారెస్పీ నీటి విడుదల ఖరారు..

by Sumithra |
SRSP : ఎస్సారెస్పీ నీటి విడుదల ఖరారు..
X

దిశ, బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేపట్టడానికి స్కివం ( స్టేట్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ) కమిటీలో నిర్ణయించినట్లు ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. కమిటీలో నిర్ణయించిన ప్రకారం ఈ నెల 7వ తేదీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకు నీటి విడుదల చేయనున్నారు. వారబందీ ప్రకారం ఈ నీటి విడుదల జరగనుంది. వారబందీ ప్రకారం 7 రోజులు 3 వేల క్యూసెక్కులు 8 రోజులు 5000 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. రిజర్వాయర్ లో 45 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కాకతీయ కాలువ ద్వారా 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్ష్మీ కాల్వ ద్వారా 25 వేల ఎకరాలు, సరస్వతి కాలువ ద్వారా 35 వేల ఎకరాలు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 57,763 ఎకరాలు, గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 38,967 చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 17 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. గత ఏడాది కంటే ఈ సీజన్లో ప్రాజెక్టులోకి వరద తక్కువగా వచ్చే చేరినప్పటికీ నాయకులు అధికారులు రైతుల మేలుకోరి కాలువలకు నీటి విడుదల చేస్తుండటంతో ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వానాకాలం పంటలకు భరోసా..

ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాల నుంచి మరింత వర్షాలు కురిసి వరదలు వచ్చే అవకాశమున్నందున నీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు చేశారు. వానకాలం పంటలకు నీటి విడుదల చేపట్టాలంటే కనీసం ప్రాజెక్టులో 56 టీఎంసీల వచ్చి చేరాలి. ప్రస్తుతం అంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ నీటి విడుదలను రైతులు వేసుకునే పంటలను దృష్టిలో ఉంచుకొని నాయకులు, ప్రభుత్వ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో ..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నిరంతరం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 22,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. సీజన్ లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 39 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం 1079.80 అడుగులు 45 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed