బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

by Sridhar Babu |
బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ లోని బాలికల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఇబ్రహీం మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు పెద్ద సంఖ్యలో శుక్రవారం తరలివచ్చి ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెర్కిట్ లోని బాలికల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో ఇబ్రహీం అనే ఉపాధ్యాయుడు గత ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఐదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు,

మైనార్టీ యువకులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు ఇబ్రహీంకు దేహాశుద్ధి చేశారు. 15 రోజుల క్రితం ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఆసియా సుల్తానాకు చెప్పినా పట్టించుకోలేదని బాలికలు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ఫిర్యాదు చేయగానే హెచ్ఎం పరిష్కరించకుండా బెదిరించారన్నారు. విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. లైంగికంగా వేధిస్తున్నాడని బాలికలు చెప్పడంతో పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయురాలు ఆసియా సుల్తానాను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు పాఠశాలకు చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాధ్యాయుడు ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. సంఘటనా స్థలానికి ఎంఈఓ రాజ గంగారాం చేరుకొని ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

Next Story

Most Viewed