ప్రభుత్వం స్పందించే వరకు పోరు ఆగదు

by Sumithra |
ప్రభుత్వం స్పందించే వరకు పోరు ఆగదు
X

దిశ, భిక్కనూరు : పట్టాదారుల ఇండ్ల స్థలాలకు సంబంధించి లే అవుట్ చేసి ఇవ్వడంతోపాటు, అర్హులైన నిరుపేదలకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుపేదలు ఆందోళన చెపట్టారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు పోరు ఆగదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు హెచ్చరించారు. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని మల్లు స్వరాజ్యం కాలనీలో గురువారం ఆందోళనకారులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ప్రభుత్వం స్పందించే విధంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలో గత 27 రోజులుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పేద ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకులు, గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేదలకు సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు.

కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేసి, పేదలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా వారు తమ వైఖరిని మార్చుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూ సాధన సమితి సభ్యులు దేవరాజ్, అర్జున్, ప్రవీణ్, కడారి భూమయ్య, వడ్ల హన్మంత్, గండికోట ఎల్లవ్వ, నరసవ్వ, సావిత్రి, చంద్రకళ, ఎర్రోళ్ల పద్మ, కొంగ యాదమ్మ, కనకవ్వ, గౌరవ్వ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story