ఆర్మూర్‌లో రాకేష్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆ ఎంపీపీపై అవిశ్వాసం..!

by srinivas |   ( Updated:2023-12-19 02:56:16.0  )
ఆర్మూర్‌లో రాకేష్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆ ఎంపీపీపై అవిశ్వాసం..!
X

దిశ, నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా ఉంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి టార్గెట్ చేశారు. ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి మాల్ కేంద్రంగా జరిగిన చట్ట నిబంధనల ఉల్లంఘనను ఎత్తి చూపారు. తరువాత మాక్లూర్ మండలంలో మొరం, కంకర క్రషర్ మాఫీయాపై జిల్లా కలెక్టర్‎తో పాటు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తరువాత బీజేపీ బలంగా ఉన్నచోట స్థానిక సంస్థల్లో అధికారం కోసం ప్రయత్నాలు చేపట్టారు. దీంతో మాక్లూర్ మండల పరిషత్‎లో చేరి సమాన బలం ఉండగా అక్కడ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచన చేశారు. మాక్లూర్ మండల పరిషత్‎లో 14 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అక్కడ ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీపీ మాస్త ప్రభాకర్ తన పదవీ నిలబెట్టుకోవాలంటే ప్రస్తుత సభ్యులతో పాటు మరొకరి సపోర్టు తప్పనిసరి. అదే విధంగా బీజేపీ ఎంపీపీగా గెలువాలంటే మరో ఇద్ధరు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో మాక్లూర్ ఎంపీటీసీను కొందరు కిడ్నాప్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయలేదని పోలీస్ కమిషనర్‌కు ఆమె కుటుంబ సభ్యులు, ఎంపీటీసీల ఫోరం ఫిర్యాదు చేశారు. కానీ అదే రోజు రాత్రి వరకు సదరు ఎంపీటీసీ ఇంటికి క్షేమంగా చేరడం విశేషం.

మాక్లూర్ ఎంపీపీపై అవిశ్వాసం..!

అయితే మాక్లూర్ మండల పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అక్కడ అవిశ్వాస తీర్మానంను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం తన అనుచరుడిని అక్కడ ఎంపీపీగా కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఒక్కరి మద్దతు కోసం, బీజేపీ ఇద్ధరి మద్దతు కోసం క్యాంపు రాజకీయాలతో పాటు ఎంపీటీసీల మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మాక్లూర్ ఎంపీపీని కోసం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఢీ అంటే ఢీ అనే చందంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జనరల్ స్థానంలో దళితుడు ఎంపీపీ కావడం బీజేపీ జీర్ణించుకోవడం లేదని, కొన్ని దళిత సంఘాలు మండిపడ్డాయి. మరికొంత మంది దళిత సంఘాల నాయకులు పైడికి మద్దతు ప్రకటించారు. దానితో ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా?, విగి పోతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

సిట్టింగ్ ఎంపీపీకి పదవి గండం ఎందుకు?

అయితే ఎంపీపీ పదవి కారణంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య అక్కడ సిట్టింగ్ ఎంపీపీకి పదవి గండం ఎందుకని కొందరు రాజీ మార్గాలు యోచన చేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల్లో ఎంపీపీ పదవీ కోసం కనివిని ఎరుగని రాజకీయం జరుగుతుంది. మాక్లూర్‌లో జీవన్ రెడ్డి వ్యతిరేక వర్గం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మాక్లూర్ మండలంలోనే జీవన్ రెడ్డికి తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అక్కడ ఎంపీపీ పదవిని బీజేపీ దక్కించుకోవడం సులువు అనే చర్చ జరుగుతుంది. దాని కారణంగానే అక్కడ కులం కార్డు ఉపయోగించి ప్రతిపక్షాలను బదనాం చేసే కార్యక్రమం జరగుతుంది. కాని ఎంపీపీపై అవిశ్వాస పరీక్ష జరిగితే ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరిదిపై చేయి అనేది తేలిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed