ర్యాగింగ్‌పై పరస్పరం కంప్లైంట్ చేసుకున్న ఫార్మసీ స్టూడెంట్స్

by Vinod kumar |
ర్యాగింగ్‌పై పరస్పరం కంప్లైంట్ చేసుకున్న ఫార్మసీ స్టూడెంట్స్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని తిరుమల విద్యా సంస్థల్లో జరిగింది ర్యాగింగా లేక ఈవ్ టీజింగ్‌గా అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 19న కళాశాలలో ఫ్రెషర్స్ డే సందర్భంగా జూనియర్ విద్యార్థులు క్రీడా పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ వేడుకలకు సీనియర్లను ఆహ్వానించేందుకు వెళ్లగా జూనియర్లపై దాడి చేశారని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించినందుకు యజమాన్యం నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.

గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తిరుమల ఫార్మసీ కళాశాలలో ర్యాగింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. శుక్రవారం ఉదయం తిరుమల బీ ఫార్మసీ కి చెందిన 28 మంది విద్యార్థినీలు తమను ఫార్మసీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేశారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే జూనియర్ విద్యార్థులే తమపై దాడి చేశారని సీనియర్లు ఆరోపించడం కొసమెరుపు. కళాశాలలో తమను వేధిస్తున్నారని అకారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఎవరిని ర్యాగింగ్ చేయలేదని సీనియర్ విద్యార్థులు తెలపడం విశేషం. మరో గ్రూప్‌కు సంబంధించిన కొందరు విద్యార్థినిలు తమను ఎవరు వేదించడం లేదని, ర్యాగింగ్ చేయలేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తిరుమల మెడికల్ కళాశాలలో యాజమాన్యం తీరే విద్యార్థుల మధ్య గొడవకు, విభేదాలకు కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కళాశాలలో ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోకుండా మూడు రోజుల సెలవు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలలో ర్యాగింగ్ జరుగలేదని అది చిన్న గొడవేనని కళాశాల యాజమాన్యం ప్రకటించడం గమనార్హం. కళాశాలలో ర్యాగింగ్, ఈవ్ టిజింగ్ జరుగుతుంటే పట్టించుకోకుండా విద్యార్థులను గ్రూప్‌లుగా విడదీసి పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు యజమాన్యమే కారణమని వాదనలు ఉన్నాయి. 28 మంది విద్యార్థినీలు నేరుగా సంతకాలతో ఫిర్యాదు చేస్తే ఏడుగురు మాత్రం మరో గ్రూప్‌గా వచ్చి తమపై ఎలాంటి వేధింపులు జరుగలేదని ఫిర్యాదులు చేయడం అందులో భాగమేననే వాదనలు ఉన్నాయి. పోలీసుల విచారణలోనైనా తిరుమల విద్యా సంస్థల్లో సీనియర్, జూనియర్ల మధ్య జరుగుతుంది ఈవ్ టీజింగ్‌గా..? లేక ర్యాగింగ్‌గా..? అనేది తేలుతుందో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed