భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

by Sridhar Babu |
భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ,నిజాంసాగర్ : గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆయన సోమవారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించి పరిశీలించారు. ప్రాజెక్టు నీటి మట్టం,సామర్థ్యం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, ప్రాజెక్టులు నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయని అన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులలో నీళ్లు లేక పోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందారని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టు నిండు కుండలా మారిందన్నారు. హల్ది వాగు, పోచారం ప్రాజెక్టుల ద్వారా 58 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రావడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు 9 టీఎంసీల కు చేరిందన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆయకట్టు రైతులు అధైర్య పడకుండా ఉండాలని కోరారు. నీటి పారుదల శాఖ అధికారులు నీటిని వృథా చేయకుండా వ్యవసాయానికి అనుగుణంగా విడుదల చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, కావున ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రెవెన్యూ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని, రైతులను కాపాడుకుంటామని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో చేపలు పట్టేందుకు జాలరులు ప్రాజెక్టులు, చెరువులలోకి వెళ్లవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, నాయకులు శంకర్ యాదవ్, అంజయ్య, మోహన్, నారా గౌడ్, నీటిపారుదల శాఖ అధికారులు కామారెడ్డి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్,నిజామాబాద్ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రావు, సూపర్డెంట్ డివిజనల్ ఇంజనీర్ వాసంతి, ఈఈ సోలమన్, ఏఈఈ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed