పెద్ద మల్లారెడ్డిలో నీట మునిగిన ధాన్యం పంట పరిశీలన..

by Sumithra |
పెద్ద మల్లారెడ్డిలో నీట మునిగిన ధాన్యం పంట పరిశీలన..
X

దిశ, భిక్కనూరు : అకాల వర్షాలకు నీట మునిగిన ధాన్యం పంట రైతుల వివరాలు నమోదు చేసుకొని వెంటనే రిపోర్ట్ తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను, నీట మునిగిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. కోతకొచ్చిన దశలో అకాల వర్షాలు తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని ధాన్యం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ధాన్యం చేతికొచ్చే సమయంలో, ఈ విధంగా ప్రకృతి పగబట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు వేడుకున్నారు.

వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందిని పిలిచి పంట నష్టపోయిన రైతుల వివరాలు, ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్న వివరాలు నమోదు చేసుకొని నివేదిక తయారు చేసి పంపాలని ఆదేశించారు. కంచర్ల గ్రామంలో పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నానని, మీరుగ్రామానికి వస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చానని వ్యవసాయ శాఖ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. మండలం మొత్తంలో కురిసిన అకాల వర్షాలకు 5,600 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఆయన వెంట తహసిల్దార్ బట్టు ప్రేమ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్, మాజీ సర్పంచ్ సత్తూరి రాజలింగం, ఎంపీటీసీ సభ్యులు కోడూరి సాయ గౌడ్, గోల్కొండ రాములు, చల్మెడ బాబు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story